బాధ్యత నాదే, ఆడబిడ్డలకు పండంటి పథకం: బాబు
విజయవాడ: ఆడపడుచులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయటమే తమ పార్టీ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆడపిల్లల రక్షణ మా బాధ్యత తనదేనని చెప్పారు. మహిళలపై తెగబడే వారి గుండెల్లో నిద్రపోతామని, తల్లీబిడ్డల ఆరోగ్యం కాపాడేందుకు 'పండంటి బిడ్డ' పథకాన్ని ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు పౌష్టికాహారాన్ని అందించేందుకు రూ.10వేలు కేటాయిస్తామని ప్రకటించారు.
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన 'మహిళా గర్జన' సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలందరికీ సెల్‌ఫోన్లు ఇస్తామని, ఆపద సమయంలో ఆదుకునేందుకు అందులోనే ఓ మీట ఏర్పాటు చేసి దాన్ని నొక్కితే, ఆపదలో ఉన్న మహిళ ఎక్కడున్నారో.. తెలుసుకుని రక్షించే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

ఢిల్లీలో నిర్భయ ఉదంతం తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చినా మహిళలపై అరాచకాలు ఆగలేదని విమర్శించారు. తొమ్మిదేళ్ల తమ పార్టీ పాలనలో ఆడపిల్లలపై అకృత్యాలకు పాల్పడటానికి ఏ రౌడీ సాహసించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారి, జిల్లాల్లో ఐజీ స్థాయి అధికారి, ఆర్డీవో పరిధిలో ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు.
ఆడపడుచులు తీసుకున్న డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. మహిళల అభ్యున్నతికి వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తానని, బెల్టు షాపులను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. అవినీతి దేశానికి కేన్సర్ వంటిది.
అవినీతి రహిత భారతదేశ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, అది తన కల అని చంద్రబాబు ప్రకటించారు. లక్ష కోట్లు దోచుకున్న వారు రాజకీయాలలో ఉంటూ విలువల గురించి చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలో సోనియా గాంధీ ఓ అవినీతి అనకొండ అన్నారు. మన రాజకీయ నాయకులు దోచుకున్న డబ్బుతో స్విస్ బ్యాంకులు నిండిపోతున్నాయని ఆరోపించారు.












Click it and Unblock the Notifications