సీఐడీ ఆఫీస్‌లో బాలయ్య, బ్రాహ్మణి- ఇద్దరికీ అనుమతి..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా.
ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

చంద్రబాబును సీఐడీ ప్రధాన కార్యాలయానికి తరలించారనే విషయం తెలుసుకున్న వెంటనే ఆయన భార్య నారా భువనేశ్వరి, కుమారుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ వాగ్వివాదానికి దిగారు.
కొద్దిసేపటి తరువాత చంద్రబాబు వియ్యకుండు, ప్రముఖ నటుడు, టీడీపీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, కోడలు నారా బ్రాహ్మణి.. సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట నందమూరి కుటుంబ సభ్యులు ఒకరిద్దరు ఉన్నారు. తొలుత గన్నవరం విమానాశ్రయం వద్ద కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు బాలకృష్ణ.
చంద్రబాబు అరెస్టును అక్రమమని అభివర్ణించారు. రాజకీయ కక్షసాధింపు వల్లే అరెస్ట్ చేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్కడి నుంచి నేరుగా సీఐడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. బాలకృష్ణ, బ్రాహ్మణి ఇద్దరూ సీఐడీ కార్యాలయంలోనికి వెళ్లడం కనిపించింది.

చంద్రబాబు కుటుంబ సభ్యులు వచ్చారనే సమాచారం తెలిసిన వెంటనే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబును కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఐడీ అధికారులు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications