జగన్ క్యాంపు ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం-స్పందన పబ్లిసిటీకేనా అని చంద్రబాబు ప్రశ్న
ఇవాళ ఉదయం కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద స్పందన కార్యక్రమానికి వచ్చింది. అక్కడ ఆమెకు తగిన స్పందన లభించకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆస్పత్రికి పంపారు. మంత్రి దాడిశెట్టి రాజా మాజీ గన్ మెన్ తమ స్ధలం అమ్ముకోనివ్వకుండా వేధిస్తున్నాడని, తన కూతురి వైద్యం కోసం డబ్బు అవసరమని వాపోయింది.
ఈ ఘటనపై విపక్ష నేత చంద్రబాబు స్పందించారు. పబ్లిసిటీకే పరిమితం అయిన స్పందన కార్యక్రమం ఎందుకని ఆయన ఇవాళ ప్రశ్నించారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో అధికార మదంతో సామాన్య ప్రజలపై జరుగుతున్న వేధింపులకు ముగింపు ఎప్పుడు? అన్నవరానికి చెందిన ఆరుద్ర అనే మహిళ న్యాయం కోసం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

కూతురి వైద్యానికి తన ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఆమెకు లేకుండా చేయడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. దీనికి కారణం అయిన మంత్రి గన్ మెన్ తదితరులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తనకు న్యాయం చేయమని గతంలో కాకినాడ కలెక్టరేట్ ముందు ఆరుద్ర ధర్నా చేసినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రజలను కలవాలంటే ఈ ముఖ్యమంత్రికి అహంకారం అడ్డొస్తుందా? ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు పబ్లిసిటీకి పరిమితమైన స్పందన కార్యక్రమంతో ఎవరికి ఉపయోగం? అని చంద్రబాబు విమర్శలు ఎక్కుపెట్టారు.













Click it and Unblock the Notifications