ఈ సినిమా.. వేరే లెవెల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం 'మా ఇంటి బంగారం' జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. మొదటి నుంచీ కేవలం సినీ ప్రేమికుల్లోనే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను రేకెత్తించింది. ఓ పూర్తి స్థాయి యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో సమంత సరికొత్త అవతారంలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. 90లలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్టోరీ సినీ అభిమానులను ఎలా అలరించిందో ఈ రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం.

కథ

ఈ వైవిధ్యమైన సినిమా కథాంశం విషయానికి వస్తే.. కథ మొత్తం 1990ల నాటి గ్రామీణ, పట్టణ నేపథ్యంలో సాగుతుంది. స్వర్ణ (సమంత) అనే ఒక చురుకైన యువతి తన గతాన్నిదాచిపెట్టి, ఓ పెద్ద ఉమ్మడి కుటుంబానికి చెందిన డాక్టర్ అనిరుధ్ (దిగంత్ మంచాలే) అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత భర్తతో కలిసి మొదటిసారి తన అత్తగారి ఇంటికి అడుగుపెడుతుంది స్వర్ణ.అత్తవారింట్లో అందరితో కలిసిపోవడానికి, వారి పద్ధతులను అలవర్చుకోవడానికి స్వర్ణ ఎంతో ప్రయత్నిస్తుంది. అయితే ఆమె స్వభావం, ప్రవర్తన సాధారణంగా ఓ సాంప్రదాయ కుటుంబం ఆశించే కోడలి పద్ధతులకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో అనేక హాస్యభరితమైన పరిస్థితులు తలెత్తుతాయి. మరోవైపు తన వెనుక ఉన్న ఓ భయంకరమైన యాక్షన్ గతం ఎక్కడ బయటపడుతుందో అని స్వర్ణ ఎప్పుడూ లోలోపల తీవ్ర ఆందోళన చెందుతూ ఉంటుంది.

Maa Inti Bangaaram Movie Review Samantha Shines in This Action Family Entertainer Full Details

అసలు స్వర్ణ నేపథ్యం ఏమిటి, ఆమె ఎందుకు తన గతాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచాలనుకుంది, ఆమె దాచిన రహస్యాల వల్ల ఆ కుటుంబానికి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి అనే అంశాల చుట్టూ మిగిలిన కథ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రసిద్ధ 'బాషా' ఫార్మాట్‌ను గుర్తుకు తెస్తుంది. ఒక సాధారణ వ్యక్తిగా చలామణి అవుతూ, తన వెనుక ఒక పెద్ద యాక్షన్ హిస్టరీని దాచిపెట్టే పాత్ర చుట్టూ కథనం అల్లబడింది.

దర్శకురాలు నందిని రెడ్డి ఈ పాత కథా సూత్రాన్ని నేటి తరానికి తగినట్టుగా చక్కటి హాస్యంతో, భావోద్వేగాలతో ముడిపెట్టి తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కథలో వచ్చే మలుపులు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మొదటి భాగంలో కథ చాలా వేగంగా, ఆసక్తికరంగా సాగుతుంది. స్వర్ణ తన అత్తగారింట్లో పడే పాట్లు ప్రతి ఒక్కరినీ నవ్విస్తాయి. ఇందులో సమంత నటన చాలా సహజంగా ఉంది.

ప్లస్ పాయింట్స్
సినిమా మొత్తాన్ని సమంత తన అద్భుతమైన నటనతో ఒంటిచేత్తో నడిపించిందని చెప్పవచ్చు. హాస్య సన్నివేశాల్లో చమత్కారంగా నటిస్తూనే, యాక్షన్ సీక్వెన్స్‌లలో దుమ్మురేపే పవర్‌ఫుల్ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సమంత చిత్తూరు యాసలో పలికిన డైలాగులు థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. కథనంలో అక్కడక్కడా కొన్ని నెమ్మదించిన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సమంత తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను నిలబెట్టింది. ఈ చిత్రంలో డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు అతిపెద్ద ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా రౌడీలతో సమంత తలపడే బస్సు ఫైట్ సీన్, అత్యంత ఉత్కంఠభరితంగా సాగే కార్ చేజింగ్ సీక్వెన్స్ వెండితెరపై మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ఫైట్ సీన్ల సమయంలో థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయం. క్లైమాక్స్ లో వచ్చే గందరగోళ ఫైట్ కూడా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తూ సినిమాకు సానుకూల ముగింపునిచ్చింది.

సపోర్టింగ్ కాస్ట్ విషయానికి వస్తే, ప్రముఖ యాంకర్ శ్రీముఖి అత్తవారింటి కోడలిగా మంచి కామిక్ టైమింగ్ తో ఆకట్టుకుంది. సమంత, శ్రీముఖి మధ్య సాగే కామెడీ యుద్ధం, ఒకరిపై ఒకరు ఆధిక్యత సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచుతాయి. క్లాసిక్ సాంగ్ 'ముత్యాల ముగ్గు' రీమిక్స్ కూడా సినిమాలో చాలా బాగా అమరింది. సమంత స్నేహితురాలిగా నటించిన మంజూష ముక్కావిల్లి తన పరిధి మేరకు చక్కటి నటనను కనబరిచింది.

మైనస్ పాయింట్స్
ఈ చిత్రంలో ప్రధాన బలహీనత ద్వితీయార్ధం అనే చెప్పాలి. సినిమా ఒక సుపరిచితమైన ఫార్మాట్ లో సాగడం వల్ల కథ చాలా వరకు ఊహించదగినదిగా మారిపోతుంది. రొటీన్ స్క్రీన్ ప్లే కారణంగా కథనంలో ఉత్కంఠ క్రమంగా తగ్గిపోయింది. మొదటి భాగంలో చూపించిన వినోదం, ఉత్సాహం ద్వితీయార్ధంలో కొరవడింది. ముఖ్యంగా ప్రధాన విలన్ సమంత కుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత సాగే కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగదీసినట్లు అనిపిస్తాయి. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య విలన్ గా తన పరిధి మేరకు చక్కగా నటించినప్పటికీ.. అతని క్యారెక్టరైజేషన్ చాలా బలహీనంగా ఉంది. విలన్ పాత్రకు సరైన లోతు, బలం లేకపోవడం వల్ల క్లైమాక్స్ లో ఉండాల్సినంత ఇంటెన్సిటీ లోపించింది. కథలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉండాల్సినంత ఎమోషనల్ డెప్త్ లేదు. దీనివల్ల ప్రేక్షకుడు కథాంశంతో పూర్తిగా కనెక్ట్ కాలేకపోతాడు.

ఎడిటింగ్ విభాగం కూడా ద్వితీయార్ధంలో సరిగ్గా పనిచేయలేదు. సినిమా నిడివిని దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల వరకు తగ్గించి ఉంటే కథ మరింత వేగంగా సాగి, ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇచ్చేది. అలాగే కొన్ని చోట్ల పాత్రల డైలాగులకు, లిప్ సింక్ కి మధ్య స్పష్టమైన తేడాలు కనిపించడం సినిమా నాణ్యతను కొద్దిగా దెబ్బతీసింది. అయితే సాధారణ ప్రేక్షకులు వీటిని సులభంగానే దాటవేయవచ్చు.

సాంకేతిక విభాగం
సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు మంచి ఊపునిచ్చింది. అయితే పాటల మ్యూజిక్ అంతగా గుర్తుండిపోయేలా లేదు కానీ సినిమా మూడ్ కి తగ్గట్టుగా బాగుంది. 'తస్సదియ్యా' పాట వెండితెరపై కలర్ ఫుల్ గా విజువలైజ్ చేయబడింది. ఓం ప్రకాష్ కెమెరా పనితనం 90ల నాటి వాతావరణాన్ని చక్కగా గుమ్మరించింది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ప్రథమార్ధంలో బాగున్నా, ద్వితీయార్ధంపై మరికొంత దృష్టి పెట్టి ఉండాల్సింది.

రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలతో కూడి ఉంది. సినిమా రిచ్ గా కనిపించడంలో వీరి ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది. నందిని రెడ్డి కామెడీ డ్రామా విభాగాన్ని అద్భుతంగా డీల్ చేసినప్పటికీ, మాస్ యాక్షన్ సీన్లను నడిపించడంలో కొంత తడబడ్డారు. ద్వితీయార్ధాన్ని, పకడ్బందీగా రాసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది.

ఫైనల్‌గా..
'మా ఇంటి బంగారం' చిత్రం సమంత అద్భుతమైన నటనతో సాగే ఓ సాధారణ యాక్షన్ ఫ్యామిలీ ప్యాకేజీ. మొదటి సగం నిండా చక్కటి వినోదం, అద్భుతంగా డిజైన్ చేయబడిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్లు. ద్వితీయార్ధంలో సాగదీత కథనం, బలహీనమైన విలన్ ట్రాక్ కొద్దిగా ఇబ్బంది పెట్టినా, సమంత అద్భుత నటన కోసం, ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఒకసారి తప్పకుండా చూడదగిన చిత్రం.

రేటింగ్: 3/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+