అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్! సంధ్య థియేటర్ కేసులో బిగ్ ట్విస్ట్
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఈ నెల 22న (సోమవారం).. తమ ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో అల్లు అర్జున్ పేరును చేర్చడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా పేర్కొంటూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1 నుంచి ఏ10 వరకు నిందితులుగా చేర్చిన పోలీసులు.. సినీ నటుడు అల్లు అర్జున్‌ను ఏ11 గా పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కోర్టు మొత్తం 19 మందికి సమన్లు జారీ చేయడం గమనార్హం. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితులందరూ వ్యక్తిగతంగా హాజరైన తర్వాతే ఈ కేసు పూర్తిస్థాయి విచారణ ప్రారంభం కానుంది.
అసలేం జరిగిందంటే..?
2024 డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అక్కడ తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. థియేటర్ వద్ద సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, జనసందోహాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకోవడంతో సోమవారం అల్లు అర్జున్ కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications