చంద్రబాబు సానుభూతి అస్త్రం - జగన్ లెక్కలేంటి, కలిసొచ్చేదెవరికి..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ ఆలోచనపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర మలుపుగా మారుతోంది. ఈ పరిణామంతో టీడీపీకి సానుభూతి కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో జగన్ లెక్కలు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో, ఈ పరిణామాలు ఎవరికి కలిసి వస్తాయనేదే ఇప్పుడు చర్చ.
అరెస్ట్ లెక్కలు మారుస్తుందా:చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలి సారి రిమాండ్ కు వెళ్లారు. ఈ సమయంలో జగన్ కు అనుకూల..చంద్రబాబు మద్దతు దారుల అభిప్రాయాలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ బంద్ కు పిలుపునిచ్చింది. పవన్ మద్దతుగా నిలిచారు. పొత్తులు, సానుభూతి సహజంగా ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పలు కేసుల్లో స్టే ల మీద ఉన్న చంద్రబాబు ఇప్పుడు జగన్ హయాంలో జైలుకు వెళ్లక తప్పలేదనే పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. దీంతో, అసలు టీడీపీ అంచనా వేస్తున్నట్లుగా చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి కలిసి వస్తుందా అంటే పలు రకాల విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి.

సానుభూతి కలిసి వచ్చేనా:చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లటంతో టీడీపీకి సానుభూతి వస్తుంది.. జగన్ ఎందుకిలా చేసారంటూ చర్చ మొదలైంది. కాంగ్రెస్ ను విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టిన తరువాత జగన్ పైన కేసుల కారణంగానే సానుభూతి వచ్చిందనే లెక్కలను అటు టీడీపీ..
ఇటు వైసీపీ తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబు విషయంలో రిపీట్ అవుతుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, ఇక్కడే జగన్ లెక్కలు ఆసక్తి కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 లో జగన్ అధికారంలోకి రావడానికి ఆయన జైలుకు వెళ్లటం కారణం కాదు. అదే నిజమైతే 2014లోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ, ప్రజలు అధికారం ఇవ్వలేదు. 2014-19 చంద్రబాబు పాలనపై వ్యతిరేకత, జగన్ పాదయాత్ర..హామీలు...సోషల్ ఇంజనీరింగ్ కలిసి జగన్ కు 151 సీట్లకు కారణమయ్యాయి.

జగన్ లెక్కలే వేరు:అంతే తప్ప 2019లో జగన్ అధికారంలోకి రావడానికి అంతకు ముందెప్పుడో జగన్ జైలుకు పోవడానికి సంబంధమేలేదు. ఇదే సమయంలో జగన్ తమను వేధిస్తున్నారని..జైల్లో పెట్టారని ప్రచారం ద్వారా నిజంగా చంద్రబాబు భావిస్తున్నారా అంటే కాదనే అభిప్రాయం ఉంది.
చంద్రబాబు నిజంగా ఆ నమ్మకం ఉంటే జిల్లా కోర్టులో విచారణ కోసం ఏకంగా ఢిల్లీ నుంచి కోట్లు ఖర్చు చేసి లీగల్ టీంను విజయవాడలో మొహరించే వారు కాదనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు నంద్యాల నుంచి విజయవాడకు వచ్చే లోగానే ఈ టీం మోహరించింది. సానుభూతి వస్తుందనే నమ్మకం ఉంటే ఈ ప్రయత్నం చేసేవారు కాదనే వాదన ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు మద్దతు దారులు జగన్ కు అనుకూలంగా మారే అవకాశం లేదని..అదే విధంగా జగన్ మద్దతు దారులు సహజంగానే ఈ పరిణామాలను స్వాగతిస్తారనేది సుస్పష్టం. దీంతో, చంద్రబాబు వర్సస్ జగన్ 2024 పోరులో ఈ కొత్త లెక్కలు..ఎత్తులు..పొత్తులు ఎలాంటి సమీకరణాలకు...ఎన్నికల ఫలితాలకు కారణం అవుతాయనేది ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications