మోత్కుపల్లికి బాబు ఫోన్: దుష్ప్రచారమంటూ ఎర్రబెల్లి
హైదరాబాద్: రాష్ట్ర విభజన ఖాయమనైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులును బుజ్జగిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులుకు చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఫోన్ చేశారు. శనివారం జరిగే తెలంగాణ ప్రాంత పార్టీ నాయకుల సమావేశానికి రావాలని ఆయన మోత్కుపల్లిని ఆహ్వానించారు.
కాగా, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు మోత్కుపల్లిని బుజ్జగించే ప్రయత్నాలు సాగించారు. వారిద్దరు మోత్కుపల్లి నర్సింహులు నివాసానికి వెళ్లి జరిగింది మరిచిపోవాలని కోరారు. రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై అలిగిన మోత్కుపల్లి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతామని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ రెండు సార్లు లేఖలు ఇచ్చిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో గుర్తు చేశారు. తెలంగాణ అంతటా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తెలంగాణను అభివృద్ధి చేసింది తమ పార్టీ కాదని ఎవరూ చెప్పలేరని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి కన్నా బలమైన క్యాడర్ తమ పార్టీకే ఉందని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
కాగా, వచ్చే ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేసేందుకు చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు సోమవారం సీమాంధ్ర నాయకులతో సమావేశమవుతారు.












Click it and Unblock the Notifications