వదిలి పెట్టను, నాకు ఆ సత్తా ఉంది: జగన్ వర్సెస్ చంద్రబాబు
హైదరాబాద్: తెలుగు వారి ప్రయోజనాల కోసమే తాము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఏపీ శాసన సభలో అన్నారు. ప్రధాని మోడీ దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పారని కితాబిచ్చారు. ప్రస్తుత కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీల వల్లనే నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు.
అందరితో పాటు ఏపీకి కూడా ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని కేంద్ర బడ్జెట్ పైన తాను అసంతృప్తి వ్యక్తం చేశానని చెప్పారు. అయితే, ఏపీకి రావాల్సిన వాటిని తాము ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సాధిస్తామని చెప్పారు. ఏపీకి న్యాయం చేస్తామన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చే వరకు తాము పోరాడుతామన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలా తాము రాజీపడమన్నారు.

తనకు మీడియా పిచ్చి ఉంటే టీవీ, పేపర్ పెట్టుకునే వాళ్లమన్నారు. ఇవాళ ప్రతిపక్ష నేతకు ఇస్తున్న సమయం తనకు ఆ రోజు ఇవ్వలేదన్నారు. ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, రైల్వే జోన్ అంశాలు ప్రత్యేక బిల్లులో లేవన్నారు. కేవలం పార్లమెంటులో హామీ ఇచ్చారని చెప్పారు. తప్పుడు పనులు చేసిన వారిని తాము వదిలి పెట్టే పరిస్థితి లేదన్నారు. వైయస్ పైన నాడు అసెంబ్లీలో పోరాడానని చెప్పారు.
రెండెకరాల పొలం నుండి వేల కోట్లు ఎలా సాధించారు: జగన్
చంద్రబాబు రెండెకరాల పొలం నుండి వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని వామపక్షాలు పుస్తకం విడుదల చేశాయన్నారు. చంద్రబాబు పైన బీజేపీయే ఆరోపణలు చేసిందన్నారు. బాబు అవినీతిపై ఆయన మామ ఎన్టీఆరే చెప్పారన్నారు. తాను సోనియానే ఎదిరించానని, చంద్రబాబును ఎదిరించే సత్తా ఉందన్నారు.












Click it and Unblock the Notifications