వరల్డ్ క్లాస్‌గా అమరావతి: కేంద్రం సాయం కావాలన్న బాబు, సీఎంకు కెఈ కితాబు
అమరావతి/కర్నూలు: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు అన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రజలు ఎక్కువగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడలో మౌలిక సదుపాయాలు పెరగాలని చంద్రబాబు అన్నారు. కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం చాలా అవసరమని చెప్పారు. తుఫానులు, వరదలు వంటి విపత్తులు ఎదుర్కోవాలంటే కేంద్రం సహకరించాలన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేరుస్తుందన్న విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.
రాయలసీమను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి బుధవారం అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

రాయలసీమ అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను స్థాపించడం ద్వారా కర్నూలు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా చంద్రబాబు మారుస్తున్నారని చెప్పారు.
కేఈ కృష్ణమూర్తి గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధిపై పెట్టినంత శ్రద్ధ రాయలసీమపై పెట్టడం లేదని ఆరోపించారు. పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లాలపై ఆసక్తి కనబరుస్తున్న చంద్రబాబు, తక్కువ స్థానాలు ఇచ్చిన కర్నూలు జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దానికి చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications