31న తునిలో కాపు గర్జన: చంద్రబాబుకు అంబటి రాంబాబు హెచ్చరిక
అమరావతి: కాపు గర్జనను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నామన్నారు.
కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి ఉంటే కాపు గర్జనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. టీడీపీలోని కాపు నేతలెవరూ కాపు గర్జనకు వెళ్లకూడదని ఆదేశాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు.

చంద్రబాబు కాపు గర్జన సభను విఫలం చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు. పైపెచ్చు ఇతర పార్టీలపై చంద్రబాబు బురద జల్లడం సరికాదని ఆయన హితవు పలికారు. కాపు గర్జనకు మాజీ మంత్రి, కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారని, ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.
కాపు గర్జన సభ జరగకుండా చేయాలని చూస్తే కాపుల ఆగ్రహానికి చంద్రాబబు గురి కాక తప్పదని ఆయన హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో ఈనెల 31వ తేదీన మాజీ మంత్రి, రాష్ట్ర కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు గర్జనను నిర్వహిస్తున్నారు.
గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల జాబితాలో చేరుస్తానని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయమని ముద్రగడ పద్మనాభం కోరుతున్నారు.












Click it and Unblock the Notifications