వాళ్లవి గుంటనక్క వేషాలు.. మరి టీడీపీ సంగతేంటి?: ఆ బాధ్యత చంద్రబాబుదే..
Recommended Video

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామనే మాట వట్టి డ్రామానే అన్న విమర్శలు ఉన్నప్పటికీ.. టీడీపీ ఎంపీలు మాత్రం తాము చిత్తశుద్దితో పోరాడుతున్నామన్న సంకేతాలు పంపించేందుకు చాలానే కష్టపడుతున్నారు.
ఏం చేసినా.. కేంద్రం నుంచి చివరాఖరికి ఎంతో కొంత ప్రయోజనం పొందితే తప్ప టీడీపీ నిబద్దతపై ప్రజలకు సందేహాలకు కలగకమానవు. ఇలాంటి తరుణంలో తమ ప్రతికూలతలు ఎక్కడ వైసీపీకి అనుకూలంగా మారుతాయోనన్న టెన్షన్ కూడా టీడీపీని పట్టుకున్నట్టు ఉంది. అందుకే ఏపీ ప్రయోజనాలపై నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలోనూ చంద్రబాబు ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.

వాళ్లవి గుంటనక్క వేషాలు..: చంద్రబాబు
ప్రధాని మోడీ ప్రాపకం కోసం వైసీపీ గుంటనక్క వేషాలు వేస్తోంది. కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్లు ప్రధానితో సమావేశమవుతుంటే ఎలా?.. ఇది సీబీఐపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పీఎంవోకీ మంచిది కాదు. స్వలాభం కోసం ప్రతిపక్ష నేతలు చేస్తున్న నాటకాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. జగన్ రాజకీయ ఎత్తుగడలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' అంటూ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారట.

టీడీపీ ఎంపీల ఫిర్యాదు..:
మ పార్టీ ఎంపీలంతా పార్లమెంటులో నిరసన తెలుపుతుండగా... రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక మూలన కూర్చున్నారని.. రాష్ట్ర ప్రయోజనాలంటే వాళ్లకు లెక్క లేదన్నట్లుగా చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారట. దీంతో ఆగ్రహం చెందిన చంద్రబాబు వైసీపీ గుంట నక్క వేషాలు వేస్తోందని మండిపడ్డారట.

మరి, ఈ సంగతేంటి?:
సరే, టీడీపీ ఎంపీల ఫిర్యాదు సంగతి బాగానే ఉంది కానీ ఇక్కడే కొన్ని విషయాల్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. గతంలో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై లోక్ సభలో గట్టిగానే నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో టీడీపీ ఎంపీలు కూడా అలాగే ఒక మూలన కూర్చొండిపోయారు.
ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కొత్తపల్లి గీత, బుట్టా రేణుక లాంటి వాళ్లు కూడా బడ్జెట్ పై నిరసనల్లో టీడీపీ సభ్యులతో కలిసి వెల్ లోకి దూసుకెళ్లినట్లు కనిపించలేదు. కారణం.. టీడీపీ వాళ్లతో కలిస్తే అనర్హత వేటు వేస్తారేమోనని. అలాగే కేంద్ర కేబినెట్ సభ్యులుగా ఉన్న టీడీపీ ఎంపీలు కూడా వెల్ లోకి వెళ్లే ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే.. ఎక్కడ మోడీ తమ పదవుల్ని పీకేస్తాడేమోనన్న భయమే.

ఆ బాధ్యత చంద్రబాబుదే..:
తాము చిత్తశుద్దితో పోరాడుతున్నామని చెబుతూనే.. వైసీపీ నిబద్దతను టీడీపీ శంకిస్తోంది. వైసీపీ ఏం చేస్తుందనేది ప్రజలే నిర్ణయిస్తారు. కానీ కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి ఎంతో కొంతైనా రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చాల్సిన తక్షణ బాధ్యత ఇప్పుడు చంద్రబాబు పైన ఉంది.
నిజానికి ఈ రెండు పార్టీలు కలిసి పోరాడితే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. కానీ రెండింటిలో ఏ పార్టీ కూడా అందుకు సిద్దంగా లేదు. ఎక్కడ తమ రాజకీయ ప్రయోజనాలు ప్రత్యర్థి పార్టీకి ఖాతాలోకి వెళ్తాయో అన్న ఆందోళన వారిది.

విమర్శలకు ఇదేనా సమయం?:
నిజానికి రాజ్యసభలో విజయసాయిరెడ్డి కాల్ ఎటెన్షన్ నోటీస్ ఇచ్చారు. ఎలాగూ మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి సీట్లోనే కూర్చుండిపోయారు. తన ఛాన్స్ వచ్చినప్పుడు 18నిమిషాలు మాట్లాడారు కూడా.
అయితే టీడీపీతో కలిసి వెల్ లోకి వెళ్లకుండా.. మాట్లాడే ఛాన్స్ తీసుకోవడమే చంద్రబాబుకు గుంటనక్క వేషం అనిపించిందేమో!. కానీ కలిసి పోరాడేందుకు ఎవరూ మెట్టు దిగే ప్రయత్నం చేయకపోగా.. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిన సమయమా ఇది? అని జనం ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications