వైసీపీకి ఒక్క సీటు దక్కవద్దు, తేడా వస్తే అంతే : చంద్రబాబు
విజయవాడ : ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వేల పరంపర భవిష్యత్తులోను నిరాటంకంగా కొనసాగబోతుంది. తాజాగా జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు చంద్రబాబు.
ప్రతీ మూడు నెలలకో మారు సర్వే చేయిస్తానని, పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు, మంత్రులకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని ఈ సందర్బంగా పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. ఇకనుంచి పార్టీపైనే ఫోకస్ పెడుతానని చెప్పిన చంద్రబాబు.. ప్రతీరోజు మూడు గంటలు పార్టీ పనులకే కేటాయిస్తానని తెలిపారు. ఇసుక అక్రమాలకు సంబంధించిన వ్యవహారాల్లో పార్టీ నేతల పేర్లు వినిపిస్తే.. సహించేది లేదని, అలా ఎవరైనా ఉంటే పార్టీ నుంచి తప్పుకోవాల్సిందిగా చెప్పాలని నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లడానికి వీల్లేదు..
ఇక త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించిన చంద్రబాబు.. ప్రతిపక్షం వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వెళ్లడానికి వీల్లేదని సూచించారు. నవంబర్ 1నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు ప్రారంభమవుతుండడంతో.. ఈలోగా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
జనచైతన్య యాత్రల్లో భాగంగా.. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు 10 రోజుల పాటు పర్యటించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. జనచైతన్య యాత్రలకు ఎమ్మెల్యేలు డుమ్మా కొడితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇకపోతే పార్టీ తరుపున టీవీ చర్చల్లో పాల్గొనేవారికి శిక్షణ ఇచ్చి పంపించాల్సిందిగా నేతలతో చెప్పారు. కాగా, జనచైతన్య యాత్ర సందర్బంగా రేషన్ కార్డులు, పెన్షన్లను ఇవ్వాలని పార్టీ నాయకులు సీఎంను కోరినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications