మోడీ స్కెచ్-కేసీఆర్ డ్రామా: తెలంగాణపై ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ, పొత్తులపై హైదరాబాద్‌కు!
అమరావతి: తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర పరిణామాలపై సునిశిత దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలతో అక్కడి పరిణామాలను తెలుసుకుంటున్నారు.

కేసీఆర్ వ్యతిరేకశక్తుల ఏకం..
తాజాగా, శుక్రవారం సాయంత్రం చంద్రబాబు.. అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతల భేటీ అయ్యారు. ఈ భేటీలో చినరాజప్ప, కళా వెంకట్రావు, దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్, ధూలిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై చర్చ జరిగింది. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితి తెలంగాణలో కన్పిస్తోందని ఈ భేటీలో పలువురు నేతలు సీఎంకు చెప్పారు.

మోడీ-కేసీఆర్ ఒప్పందం బహిర్గతం
క్షేత్రస్థాయిలో పార్టీని సమాయత్తం చేసుకుంటూనే.. తెలంగాణలో పరిణామాలను గమనించాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు. మోడీ-కేసీఆర్ ఒప్పందం బహిర్గతమైందని బాబుతో నేతలు అన్నారు. ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం కేసీఆర్ చేసిన హడావుడంతా బీజేపీ కోసమేనని మరో మంత్రి తెలిపారు.

కేంద్రం స్కెచ్ వస్తే.. కేసీఆర్ అమలు..
కాగా, బీజేపీ సూచనల మేరకే కర్ణాటకలో జేడీఎస్ వద్దకు కేసీఆర్ వెళ్లారనే భావనను మరో నేత వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి పని చేయాలన్న కొందరి సూచనను కేసీఆర్ తిరస్కరించారన్న విషయాన్ని చంద్రబాబు వద్ద ఓ సీనియర్ నేత ప్రస్తావించారు. కేసీఆర్ ప్రణాళికంతా కేంద్రం స్కెచ్చేననే విషయాన్ని మరో సీనియర్ నేత అక్కడివారికి తెలిపారు.

బీజేపీ అనుకూల పక్షాలకు వ్యతిరేకంగా..
బీజేపీకి అనుకూలంగా ఉన్న పక్షాలకు వ్యతిరేకంగా పోరాడడమే టీడీపీ ప్రస్తుత లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. ఏపీ కి ప్రత్యేకహోదా ఇస్తానని కాంగ్రెస్ అంటోందని, దానికి అడ్డుపడేలా బీజేపీ వ్యవహరిస్తోందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. ఇతర పార్టీల వైఖరిని గమనించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

రేపు హైదరాబాద్ చంద్రబాబు..
కాగా, శనివారం హైదరాబాద్‌కు వెళ్తున్న చంద్రబాబు.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై తేల్చేసే అవకాశం ఉంది. అంతకుముందే తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఒక వేళ ఈ రెండు పార్టీల చర్చలు సఫలమైతే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసివెళ్లే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications