విభజన టైంలో ఏం చెప్పారు, నా పైకి జగన్‌ని పంపారు: కేసీఆర్‌ను లాగిన బాబు
కడప: రాష్ట్ర విభజనతో చజాలా నష్టపోయామని, ప్రస్తుతం అనేక కష్టనష్టాలు అనుభవిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కడపలో నిర్వహించిన మహా సంకల్ప సభలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో కుట్రలు, కెసిఆర్ ఏమన్నారు
విభజన సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలంటూ ఎన్నో ప్రయత్నాలు చేశామన్నారు. చీకటి గదిలో అరగంటలో అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టారని, ఏపీ నష్టపోయిందన్నారు.
'విభజన సమయంలో తెలంగాణలో కేసీఆర్ చెప్పారు.. తన పార్టీని (తెరాస)కాంగ్రెస్‌లో కలుపుతామని. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. తెలంగాణ ఏర్పడ్డాక మాట మార్చేశార'ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు అదే సమయంలో జైలు నుంచి జగన్‌ను విడుదల చేసి టిడిపి పైకి పోటీగా తీసుకొచ్చారని మండిపడ్డారు.
కుట్ర చేసినా కాంగ్రెస్‌కు చేదు
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసినా చివరికి ఆ పార్టీకి చేదు ఫలితమే వచ్చిందన్నారు. భవిష్యతుత్తులోనూ కోలుకోలేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు బుద్ధి చెప్పారన్నారు.

హైదరాబాద్ మనది అనే
విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామన్నారు. హైదరాబాద్‌ని కేవలం తొమ్మిది ఏళ్లలో అభివృద్ధి చేశామన్నారు. హైదరాబాద్‌ని నాలెడ్జ్ సిటీగా మార్చామని, ప్రపంచ పటంలో పెట్టామన్నారు. హైదరాబాద్‌ను సొంత రాజధానిగా భావించి అభివృద్ధి చేశామన్నారు.
ఆంధ్ర జాతికి అన్యాయం
హేతుబద్ధలేకుండా రాష్ట్రాన్ని విభజించారని, ఆంధ్రజాతికి మొదట్నుంచీ అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధించే వరకు, ప్రజల కళ్లలో ఆనందం చూసేవరకు తాను విశ్రమించబోనన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను చాలావరకు అధిగమించామన్నారు.
రాబోయే రోజుల్లో వంద శాతం గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టిడిపి అధికారం చేపట్టిన ఈ రెండేళ్ల కాలంలో అనేక ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని, వాటినన్నింటినీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందన్నారు.
అమరావతిపై...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం తాను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఏకంగా 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. విభజన సందర్భంగా ఏపీని కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందన్నారు. దీనికి రగిలిపోయిన ప్రజానీకం మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
హామీలతో పాటు హోదా కావాలి
విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని దానికి తగిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, విద్యాసంస్థలు అన్నింటినీ వీలైనంత త్వరగా నెలకొల్పాలని, కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications