జగన్‌పై బాబు, లోకేష్ నిప్పులు: వేణుమాధవ్ చురకలు
హైదరాబాద్/రాజమండ్రి/నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. రాజమండ్రి మధిరపూడి విమానాశ్రయానికి చేరుకున్న బాబు అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ గల్లంతైందన్నారు.
రాష్ట్రంలో పరిస్థితి సీనియర్ నాయకుడిని అయిన తనకే అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెసు పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు అంటున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని తాను స్ఫష్టంగా చెప్పానన్నారు. ఆడబిడ్డలకు భద్రత లేకుండా పోయిందన్నారు. నిర్భయ చట్టం తెచ్చినా ఎక్కడా అమలు కావడం లేదన్నారు. నిర్భయ చట్టం నిరుపయోగంగా మారిందన్నారు.

తాను పెట్టిన దీపాన్ని కాంగ్రెసు నాయకులు ఆర్పివేశారన్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతిని రూ.రెండువేలుగా ఇస్తామన్నారు. ప్రతి గ్రామానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మంచినీరు ఇస్తామన్నారు. కాంగ్రెసు దొంగలను నమ్మితే రాష్ట్రాన్ని తెగనమ్మేస్తారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ కార్డుల ద్వారా పేదవాడి ఆరోగ్యం కాపాడుతామన్నారు.
వెనుకబడిన వర్గాల వారిని ఆదుకునే బాధ్యత తనదే అన్నారు. దుర్మార్గ కాంగ్రెసు పాలన నుండి విముక్తి కావాలన్నారు. తాను ఢిల్లీకి వెళ్తే అందరు తన మాట వింటారని, జగన్ వంటి అవినీతిపరుడు పోతే ఎవరు వింటారన్నారు. తనది, మోడీది అభివృద్ధి జట్టు అని, కాంగ్రెసు పార్టీది అవినీతి జట్టు అన్నారు.
ఎన్డీయే గెలిస్తే వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు ప్రధానమంత్రి అవుతారన్నారు. జగన్ కేసు మాఫీల కోసం గెలవాలని, తనకు అలాంటివేమీ లేవన్నారు. తనపై అవినీతి కేసులు లేవని, తాను ఎవరికీ భయపడనని చెప్పారు.
కక్కిస్తాం: నారా లోకేష్
పదహారు నెలల జైలు అనుభవం గల జగన్ కావాలా లేక నలభయ్యేళ్ల రాజకీయ అనుభవమున్న సమర్థవంత నేత చంద్రబాబు కావాలా ప్రజలు గుర్తించాలని నారా లోకేష్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే జగన్ తిన్న లక్ష కోట్ల రూపాయలను కక్కిస్తామన్నారు. జగన్ తొలి 4 సంతకాల ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 4 సంతకాలతో జగన్ మరింత దోచుకుంటాడని ఆయన విమర్శించారు.
వేణుమాధవ్ చురకలు
ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు పంచే డబ్బులు, చీరలు తీసుకోవాలని కానీ ఓట్లు మాత్రం టిడిపికే వేయాలని తెలుగు కమెడియన్ వేణు మాధవ్ పిలుపునిచ్చాడు. హైదరాబాదులో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబుకు ఓటేయాలన్నారు. బాబు అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications