ఆ రౌడీ షీట్లు ఎత్తెయ్యండి, రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్ళే వ్యాలిడిటీ : జగన్ సర్కార్ పై చంద్రబాబు ధ్వజం
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులపై బైండోవర్ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసిపి నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయిన చంద్రబాబు, వైసిపి పాలనలో అడుగడుగునా చట్టం, రాజ్యాంగం దుర్వినియోగం అవుతున్నాయని ఫైర్ అయ్యారు.

కరోనా కేసులు తగ్గుతున్నా అక్రమ కేసులు మాత్రం తగ్గటం లేదు
కోటబొమ్మాళి పోలీసులు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు హరి వరప్రసాద్, సురేష్, కృష్ణమూర్తి ల పై పెట్టిన రౌడీషీట్లు వెంటనే ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా ఏపీలో ప్రతిపక్ష నేతల పై అక్రమ కేసులు మాత్రం తగ్గటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అక్రమ కేసులకు రౌడీషీటర్లకు భయపడే నాయకులు తెలుగుదేశం పార్టీలో లేరని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని అరాచకంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డారు .

రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్ళే వ్యాలిడిటీ
ఇక రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్ళే వ్యాలిడిటీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
కోటబొమ్మాలి పోలీసులు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడైన కింజరపు హరి వరప్రసాద్ ను, ప్రసాద్ కుమారుడు సురేష్ ను , ఆయన అనుచరుడు కృష్ణమూర్తిని పలు కేసుల్లో ముద్దాయిలుగా గుర్తించి బైండోవర్ చేసినప్పటికీ వాటన్నింటినీ ఉల్లంఘించడంతో ఇపుడు రౌడీషీట్ తెరిచినట్లుగా చెబుతున్నారు . ఇక రౌడీషీట్ తెరవడానికి అంతకు ముందు ఉన్న పలు కేసులను ప్రస్తావించారు.

పోలీసుల వెర్షన్ ఇది .. కక్ష సాధింపు అని మండిపడుతున్న చంద్రబాబు
శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండటం కోసమే రౌడీషీట్ తెరిచామని పోలీసులు చెప్తుంటే, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టిడిపి నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తుందని, అక్రమ కేసులు బనాయిస్తుందని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు సైతం పోలీసుల తీరుపై, జగన్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారిపై తెరిచినా రౌడీ షీట్ లను ఎత్తివెయ్యాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications