జగన్.. స్టాలిన్ ను చూసి నేర్చుకో; కరోనాను తేలిగ్గా తీసుకున్నావ్ : సాధన దీక్షలో చంద్రబాబు ధ్వజం
ఈరోజు అమరావతిలో సాధన దీక్ష పేరుతో కరోనా బాధితులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు, బాధిత కుటుంబాలను చూసినా జగన్ చలించలేదని విమర్శించారు. కరోనా మహమ్మారికి ప్రపంచమంతా భయపడితే, జగన్ మాత్రం తేలిగ్గా తీసుకున్నారని ఆక్షేపించారు.

కరోనా మృతుల వివరాలు వెల్లడించాలని డిమాండ్
కరోనా బాధితుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా ఇతర డిమాండ్లను చేసిన చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సాధన దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో కరోనా మృతుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి వివరాలు బయటపెట్టాలని జగన్ ను డిమాండ్ చేశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా భారత్ బయోటెక్ కు కులం ఆపాదిస్తారా అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ప్రపంచం భయపడుతుంటే జగన్ కరోనాను తేలిగ్గా తీసుకున్నారు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తాన్ని భయభ్రాంతుల్ని చేస్తే, బాధ్యతగల ప్రతిపక్షంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సూచనలు చేసినా జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని సిఎం చెప్పారని గుర్తు చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆరోగ్యంపై ఆలోచించాలని చెబితే తమపై తప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడారని, పది, ఇంటర్ పరీక్షల పట్ల వితండవాదం చేశారని పేర్కొన్న చంద్రబాబు, సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారు అంటూ విమర్శించారు. తీరా సుప్రీంకోర్టు సీరియస్ అయితే తోక ముడిచిందని పరీక్షలను రద్దు చేసిందని పేర్కొన్నారు చంద్రబాబు.

తమిళనాడు సీఎం ను చూసి అయినా నేర్చుకో ..
ప్రస్తుతం మూడవ వేవ్ కరోనా వస్తుందని చెబుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో చాలా మంది నిరుపేదలు, ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్ లు, హమాలీలు పని లేక, కనీసం తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు చంద్రబాబు. సీఎం జగన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ లను ఇప్పటికీ నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అమ్మ క్యాంటీన్ లో జయలలిత ఫోటో పెట్టి కొనసాగిస్తున్నారని అది రాజకీయ సంస్కృతికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దిశా కార్యక్రమం అందుకే .. ఇంటి పక్కనే అత్యాచారం జరిగినా పట్టింపేది
ఇక రాష్ట్రంలో దిశా చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్లా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి పక్కనే అత్యాచారం జరిగితే పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చట్టాలు కాదు కావాల్సింది, చట్టాలను అమలు చేసే సత్తా ఉంటే ఇప్పటికే ఉన్న చట్టాలే సరిపోతాయని పేర్కొన్నారు. అత్యాచార నిందితులను పట్టుకోలేక ప్రశ్నించే వారిపై అత్యాచార కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన సాధన దీక్ష నుండి దృష్టి మరల్చడం కోసమే దిశా కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు
కరోనా తీవ్రతలోనూ మద్యం దుకాణాలు తెరిచి దారుణంగా వ్యవహరించారన్నారు. చేతనైతే పేదలను ఆదుకోవాలని, తప్పుడు కేసులు పెడతామంటే ఊరుకునేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇక తప్పుడు కేసుల కారణంగా పోలీసు వ్యవస్థ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, రైతులు, కార్మికులు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు పనులు లేక పస్తులు ఉంటున్నారు అని ,అయినా ఏపీ సర్కార్ పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ హయాంలో తాము కూడా ఇలాగే తప్పుడు కేసులు పెట్టి ఉంటే వైసీపీలో ఒక్కరు కూడా రోడ్డు మీదికి వచ్చే వారు కాదని చంద్రబాబు ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications