నో పేమెంట్స్: కిరణ్ రెడ్డి నిర్ణయాలకు చంద్రబాబు చెక్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్ పెడుతున్నారు. నిర్ణయాలను తిరగదోడడంతో పాటు కొన్నింటిని రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింేది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చేపట్టిన పనులకు చెల్లింపులు ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కిరణ్ కుమార్ రెడ్డి 2013 - 2014 ఆర్థిక సంవత్సరంలో 600 కోట్ల రూపాయలతో ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు. ఈ నిధికి సంబంధించిన డబ్బులను పాలనాపరమైన మంజూరు, సాంకేతికపరమైన క్లియరెన్స్ అవసరం లేకుండా విడుదల చేయడానికి ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది. సంబంధిత శాఖలు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నిధులను విడుదల చేసే అవకాశం ఉంటుంది.

ఆ నిధి కింద అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గానికి 15 రోజుల్లో వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అది కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం. అప్పట్లో ఈ విషయంపై వివాదం కూడా చెలరేగింది.
సీమాంధ్ర నియోజకవర్గాల్లో చేపట్టిన పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 250 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. ఈ చెల్లింపులను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు మంజూరు చేసిన ప్రాజెక్టులను అన్నింటినీ ఆపేయాలని తొలుత చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, దాన్ని ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకు పెంచింది.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రులు యనమల రామకృష్ణుడు, కె. శ్రీనివాస్, కె. అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథ రెడ్డిలతో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ సిపార్శులను బట్టి భూములు, గనులు, ఇతర కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఆ నిర్ణయంతో రోడ్లు భవనాలు, తదితర శాఖలు చిక్కుల్లో పడ్డాయి. గత ప్రభుత్వాలు ఎన్నికలకు ఒక నెల ముందు తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వాలు సమీక్షించే పద్ధతి ఉంటూ వస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు చెల్లింపులు ఆపేస్తే కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి పెనాల్టీ డిమాండ్ చేస్తారని, దాని వల్ల చిక్కులు వస్తాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications