Chandrababu : చంద్రబాబుకు మరో ఊరట- ఇతర కేసుల్లోనూ హైకోర్టుకు సర్కార్ కీలక హామీ..
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి 53 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంటూ ఇవాళ హైకోర్టు ఆదేశాలతో మధ్యంతర బెయిల్ పై విడుదలవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఊరట లభించింది. చంద్రబాబుకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ లభించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో నిన్న సీఐడీతో మరో కేసు నమోదు చేయించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
మద్యం అమ్మకాల్లో తయారీ సంస్ధలకు అనుచిత లబ్ది చేకూర్చారంటూ తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది. దీనిపై వాదనల సందర్భంగా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన లాయర్లు వాదించారు. స్కిల్ కేసులో బెయిల్ తో విడుదలవుతున్న చంద్రబాబును మద్యం కేసులో అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.

దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం హైకోర్టుకు కీలక హామీ ఇచ్చారు. స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగిసేలోపు ఇతర కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోబోమని తెలిపారు. అంటే నవంబర్ 28 వరకూ చంద్రబాబుపై నమోదైన ఇతర కేసుల్లో అంటే మద్యం కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ వంటి కేసుల్లో చర్యలు తీసుకోబోమని ఆయన హామీ ఇచ్చినట్లయింది.
అలాగే మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నవంబర్ 15న కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. దీంతో హైకోర్టు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్ 21 వరకూ వాయిదా వేసింది. ఇవాళ స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు... తిరిగి నవంబర్ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని చంద్రబాబును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన హామీకి ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications