రైతులకు చంద్రబాబు శుభవార్త.. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం అన్నదాత సుఖీభవ కోసం ఎదురుచూస్తుంది. ఇక ఇదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రైతులకు శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యవర్గంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కీలక విషయాలను వెల్లడించారు.
పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
జూన్ 12 కి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని ఇప్పటివరకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసిన ఓర్చుకోలేని వైసిపి నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

అన్నదాత సుఖీభవ అమలుకు ముహూర్తం ఫిక్స్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసిన చంద్రబాబు ఇంకా ఎంతో కాలం నిరీక్షించాల్సిన అవసరం లేదని తాజా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలో 20000 జమ చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.
మహానాడుపై చంద్రబాబు ఏమన్నారంటే
పార్టీ కార్యవర్గంతో మాట్లాడిన చంద్రబాబు ఇక ఇదే విషయాన్ని వెల్లడించారు. కడపలో 27, 28, 29తేదీలలో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈనెల 18వ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగతా అన్ని కమిటీలను వేయాలని చంద్రబాబు సూచించారు. ఇక మహానాడు తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలను వేయనున్నట్టు గుజరాత్ మోడల్ రాష్ట్రంలోనూ అమలవ్వాలని, సుస్థిర ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
తల్లికి వందనంపై చంద్రబాబు ప్రకటన
ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా, పార్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నామని, సంవత్సరం పాలనలో స్పష్టమైన మార్పు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పాఠశాలల ప్రారంభానికి ముందే 15 వేల రూపాయలు చొప్పున అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకెళ్ళండి.. చంద్రబాబు ఆదేశం
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా పని చేయనున్నామని, పోలవరానికి నిధులు రాబట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీన పింఛన్లు అందజేస్తున్నామని, దీపం 2 కింద కోటి మందికి పైగా లబ్ధిదారులకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని వీటన్నింటినీ ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పైన తీపి కబురు చెప్పి ఈ నెలలో ప్రారంభిస్తామన్నారు.












Click it and Unblock the Notifications