వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు హ్యాపీ: కాంగ్రెసులో జగన్ కుమ్మక్కు చిచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దెబ్బ మీద దెబ్బ తింటూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎట్టకేలకు ఊరట కలిగించే పరిణామం చోటు చేసుకుంది. తమ పార్టీ అధిష్టానం వైయస్ జగన్‌తో కుమ్మక్కయ్యిందని కాంగ్రెసు రాష్ట్ర నాయకులు విమర్శలు చేస్తుండడం చంద్రబాబుకు అనుకూలంగా మారింది. తమ అధిష్టానం దత్తపుత్రడిని నమ్ముకుందంటూ గత కొంత కాలంగా కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విమర్శిస్తూ వచ్చారు. ఆ దత్తపుత్రుడు ఎవరనే విషయాన్ని ఆయన అప్పట్లో చెప్పడానికి నిరాకరించారు. చివరకు ఆ దత్తపుత్రుడు వైయస్ జగన్ అనే విషయాన్ని ఆయన తేల్చేశారు.

దత్తపుత్రుడిని నమ్ముకుని తమ పార్టీ అధిష్టానం తమను మోసం చేసిందని ఆయన విమర్శించారు. తాజాగా, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పార్టీలో చిచ్చునే పెట్టాయి. ఈ విషయంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, జెసి దివాకర్ రెడ్డికి మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. జగన్ సమైక్య శంఖారావం సభకు తమ పార్టీ అధిష్టానం సహకరించిందని ఆయన ఆరోపించారు. జగన్‌తో తమ పార్టీ అధిష్టానం కుమ్మక్కయిందని చెప్పడానికి 144 దృష్టాంతాలున్నాయని ఆయన అన్నారు. సిబిఐ జగన్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడం అందుకు ఒక దృష్టాంతమని ఆయన అన్నారు.

Chandrababu happy: Rift in Congress on Jagan issue

జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. బొత్స మాటలకు జెసి దివాకర్ రెడ్డి దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జగన్‌తో కాంగ్రెసు అధిష్టానం కుమ్మక్కు వార్తలకు మరింత బలం చేకూరిందని అంటున్నారు. జగన్‌తో కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయిందంటూ చంద్రబాబు పదే పదే విమర్శిస్తూ వస్తున్నారు. చంద్రబాబు విమర్శలను ధీటుగా ఖండించే నాయకులు కూడా లేకుండా పోయారు. కాంగ్రెసు తెలంగాణ నేతలు మాత్రమే వారికి సమాధానం ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

జగన్‌ చంద్రబాబు విమర్శలను అబద్ధమని చెప్పడానికే అన్నట్లు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై హైదరాబాదులో జరిగిన సమైక్య శంఖారావం సభలో విమర్శించారు. అయితే, కాంగ్రెసు సీమాంధ్ర నాయకుల వ్యాఖ్యల వల్ల కుమ్మక్కు ప్రచారానికి బలం చేకూరిందని అంటున్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ సీమాంధ్ర కేంద్ర మంత్రులు గానీ తప్పు పట్టడం లేదు. వారు పెదవి విప్పడం లేదు.

పైగా, కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు చేస్తారని వస్తున్న వార్తలను కూడా ఎవరూ ఖండించడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెడతారని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అంటూ వస్తున్నారు. సీమాంధ్రలో కొత్త పార్టీ తాను పెట్టినా, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినా ఒక్కటేనని తాజాగా వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై ఆ ఒత్తిడి ఉందని రాయలసీమకు చెందిన రాష్టర్ మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విభజనను అడ్డుకుంటారంటూ లగడపాటి రాజగోపాల్ ప్రకటనలు చేస్తున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారంటూ మీడియాలో కూడా నిత్యం వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం లేదు. పార్టీ పెడతానని గానీ పెట్టబోనని గానీ ఆయన చెప్పడం లేదు. ఆ ప్రచారం అలాగే కొనసాగే వ్యూహాన్నే ఆయన అనుసరిస్తున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో కాంగ్రెసు అధిష్టానం అయోమయంలో పడినట్లు చెబుతున్నారు. శానససభలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని లగడపాటి రాజగోపాల్ అన్నారు. తన తరఫున లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ అనడం లేదు.

ఈ పరిణామాలన్నీ చంద్రబాబుకు రాజకీయంగా లాభించే అంశాలని భావిస్తున్నారు. కుమ్మక్కు ప్రచారానికి బలం చేకూరుతున్న కొద్దీ సీమాంధ్రలో తమ పార్టీ బలపడుతుందని చంద్రబాబు నమ్ముతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, చంద్రబాబుకు తాజా పరిణామాలు ఏ మేరకు కలిసి వస్తాయో చూడాల్సిందే.

English summary
As the rift brewing up in Congress over YSR Congress party president YS Jagan issue, Telugudesam party president Nara Chandrababu Naidu may get positive response in Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X