జగన్ కూడా శ్రీలంక లాగా ప్రకటిస్తారేమో! కరెంటు కష్టాలకు వైసీపీనే కారణమంటూ చంద్రబాబు ఫైర్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జగన్ సర్కారు అవలంభిస్తున్న విధానాలతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చిదిమేసిన సీఎం జగన్.. ఇప్పుడు సామాజిక న్యాయం అంటున్నారని విమర్శించారు.

ఏపీలో కరెంటు కష్టాలకు జగన్ రెడ్డి సర్కారే కారణం: చంద్రబాబు
వివిధ వర్గాల ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రెండు పదవులు ఇచ్చి సామాజిక న్యాయం అని వైసీపీ చెప్పుకుంటోందని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నష్టపరిచిన వైసీపీ పాలన అంతానికి టీడీపీ శ్రేణులు నడుంబిగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం 'బాదుడే బాదుడు' కార్యక్రమంపై చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జులు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కష్టాలు తలెత్తడానికి కారణం జగన్ రెడ్డి విధానాలేనని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చే స్థాయికి చేరుకున్న కష్టాలపై ప్రజలకు సవివరంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు.

శ్రీలంక లాగా.. జగన్ దివాళా ప్రకటిస్తారేమో..: చంద్రబాబు చురకలు
ఏపీలో వరుస ఛార్జీల పెంపుదలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రం క్షేమం కోసం టీడీపీకీ అధికారం కావాలన్నారు చంద్రబాబు. టీడీపీకి అధికారం ఇప్పుడు చారిత్రక అవసరం. రాష్ట్రం మిగిలి ఉండాలంటే.. టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయేలా ప్రభుత్వ విధానాలున్నాయన్నారు చంద్రబాబు. మూడేళ్లలోనే ఏడుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి రూ. 16వేల కోట్లు ప్రజల జేబుల నుంచి లాక్కున్నారని మండిపడ్డారు. శ్రీలంక ప్రకటించినట్లు ఏపీ కూడా దివాళా తీసినట్లు సీఎం జగన్ ప్రకటిస్తారేమోనని అనుమానం కలుగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఏపీలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరం, ఎందుకంటే?: చంద్రబాబు
చెత్త, ఆస్తి పన్నుులతో ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్ వాల్యూలో 15 శాతం ఆస్తి పన్ను రూపంలో వసూలు చేస్తూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా సీఎం జగన్ నిర్ణయాలతో జరుగుతున్న నష్టం, ప్రజలపై పడుతున్న భారంపై విస్తృత ప్రచారం చేయాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను కూడా స్వయంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. 2019 ఎన్నికల్లో తప్పు జరిగిందనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఇప్పుడు ప్రజలంతా టీడీపీవైపు చూస్తున్నారని చెప్పారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications