'సిఎం పదవితో బాబు సంతోషంగా లేరు': టీ చురకలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సోమవారం ఘాటుగా విమర్శలు గుప్పించగా.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చురకలు అంటించారు. ఎంపీపీ, జెడ్పీ ఎన్నిక విషయంలో జగన్ నిప్పులు చెరగగా, హైదరాబాదు శాంతిభద్రతల బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించాలన్న బాబు లేఖ పైన కేటీఆర్ సహా తెలంగాణ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
ఉదయం గవర్నర్‌ను కలిసిన అనంతరం చంద్రబాబు పైన జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవితో చంద్రబాబు సంతోషంగా లేరని, అది చాలదన్నట్లుగా ఎంపీపీ, జెడ్పీలను లాక్కుకున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుండి జెడ్పీటీసీలకు ఫోన్లు చేయడమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంతలా దిగజారాలా అని ప్రశ్నించారు.

మెజార్టీ లేకపోయినా... ఇతర పార్టీల సభ్యులను ప్రలోభపెట్టడం దగ్గర నుండి భయానక వాతావరణం సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించడం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులందర్నీ బయటకు పంపించి టీడీపీ వాళ్లు జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికైనట్లు ప్రకటించడం లాంటి అరాచకాలకు పాల్పడ్డారన్నారు. ఇందుకు సంబంధించిన సీడీలు కూడా ఉన్నాయని చెప్పారు. 3, 4, 5 తేదీలలో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు.
మరోవైపు, తెలంగాణ ప్రాంతం వారు చంద్రబాబు కేంద్రానికి రాసిన 'గవర్నర్ అధికారాల' లేఖ పైన నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీ ప్రాంగణం ఎదుట టీ న్యాయవాదులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాబుకు కేటీఆర్ చురకలు అంటించారు. చంద్రబాబు తమ అతిథి అని, తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. చంద్రబాబు ఆంధ్రా ప్రజల గురించి మాట్లాడకుండా హైదరాబాదు గురించి మాట్లాడటమేమిటని, ఆయన ఇంకా నాటి ఏపీ సీఎంగా అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications