సంక్రాంతి తర్వాత చంద్రబాబు కీలక ప్రకటన!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటే టికెట్లు రాని వాళ్ళ నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలకు టిడిపి జనసేన పొత్తులతో వెళుతున్న క్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.
జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంలో మెజారిటీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లుగా సమాచారం. అయితే మరికొద్ది స్థానాల పైన ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. రెండు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సంక్రాంతి తర్వాత అభ్యర్థులపై కీలక ప్రకటన చేయడానికి ఇరు పార్టీలు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.

సంక్రాంతి కన్నా ముందే సీట్ల విషయం ప్రకటించాలని చంద్రబాబు తొలుత భావించినప్పటికీ ప్రస్తుతం మాత్రం సంక్రాంతి తర్వాతే అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జనసేనకు కేటాయించే సీట్లను పక్కనపెట్టి, మిగతా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయే స్థానాలలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం.
సంక్రాంతి పండుగ తర్వాత తెలుగుదేశం పార్టీలో మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సుమారు 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాల టాక్. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయమని గతంలోనే చంద్రబాబు ప్రకటించిన క్రమంలో కేవలం రెండు చోట్ల మార్పులు చేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది.
ఇప్పటివరకు ఈ రెండు పార్టీలు అభ్యర్థులపై కసరత్తు చేయగా భవిష్యత్తులో వీరితో పొత్తు పెట్టుకునే మరో పార్టీ ఏదైనా కలిస్తే జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉంటుందని ఒకవేళ అదే కనుక జరిగితే అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీ జనసేన కూడా రాష్ట్రంలో ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతున్నాయి, అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications