సీఎంతో మృత్యుంజయుడు: చిన్నారి చంద్రశేఖర్‌కు రూ.2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్
గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మిడివరంలో బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో కాపాడిన ఘటనను ఒక కేస్ స్టడీగా తీసుకుని డాక్యుమెంట్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మిడివరంలో బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో కాపాడిన ఘటనను ఒక కేస్ స్టడీగా తీసుకుని డాక్యుమెంట్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
రానున్న కాలంలో ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా పునరావృత్తం కాకుండా గట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వదిలేసిన ఇలాంటి నీళ్లు పడని బోరు బావులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వాటి ఛాయాచిత్రాలు తీసి ప్రభుత్వానికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఈ విషయంలో యువత ప్రధాన భూమిక పోషించాలని, సెల్ ఫోన్‌లో మూత లేని బావుల ఛాయాచిత్రాలు తీసి సోషల్ మీడియాలో ఉంచాలని సూచించారు. ఇలా తెలియజేసిన వారికి ప్రభుత్వపరంగా తగిన ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు.
ఎవరైనా తమ తమ వ్యవసాయ క్షేత్రాలు, నివాస ప్రాంతాలలో నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చి వేయకుండా నిర్లక్ష్యంగా వదిలివేసి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇక వెనకాడబోదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించి సమయానుకూల వ్యూహాలను అనుసరిస్తే సానుకూల ఫలితాలు లభిస్తాయని చెప్పడానికి ఉమ్మిడివరం ఘటన చాటి చెప్పిందని అన్నారు.
సాధారణంగా ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు ఎన్‌డీఆర్ఎఫ్, గ్రేహౌండ్స్, అక్టోపస్, ఫైర్ సర్విసెస్, హెల్త్, పోలీస్, జిల్లా రెవెన్యూ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు దక్కుతాయన్నారు. 15 అడుగుల మేర బోరుబావిలో 11 గంటల జీవన పోరాటం చేసి మృత్యుంజయుడై తిరిగి వచ్చిన ఏడాది 9 మాసాల చిన్నారి చంద్రశేఖర్‌ను ముఖ్యమంత్రి ఎత్తుకుని ముద్దాడి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
చిన్నారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి 20 ఏళ్లకి రూ.20 లక్షలు అయ్యాక అతనికి అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications