స్కీమ్ జగన్‌ది- పేరు చంద్రబాబుది
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గత ప్రభుత్వం అమలు చేసిన మరో ఓ వ్యవస్థను రద్దు చేసి పడేసింది.
గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మార్చివేసింది చంద్రబాబు- పవన్ సర్కార్. అమ్మ ఒడికి తల్లికి వందనం, జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్దకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, నాడు-నేడుకు మన బడి- మన భవిష్యత్‌గా మార్చింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సామాజిక భద్రత పింఛన్లకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. ఈ జాబితాలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన, వైఎస్సార్ విద్యోన్నతి, వైఎస్సార్ కళ్యాణమస్తు, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథక వంటివి కూడా ఉన్నాయి. వాటిల్లో పింఛన్లు మినహా ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే.
ఈ క్రమంలో మరో పథకం పేరు మారింది. ఈ మేరకు చంద్రబాబు- పవన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వంలో అమలులో ఉన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం పేరు మారింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్టుగా పేరు మార్చింది ప్రభుత్వం ఈ మేరకు రెవెన్యూ మంత్రిత్వ శాఖ ఓ జీవో విడుదల చేసింది.
జగన్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పేరుతో కొనసాగింది. భూముల సమగ్ర రీసర్వే కోసం ఉద్దేశించిన పథకం ఇది. అత్యంత ఆధునిక పద్ధతిలో,అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమగ్ర భూ సర్వే అమలులోకి వచ్చింది. భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గ్రామ సచివాలయాల్లోనే చేపట్టింది ఈ పథకం కింద.
1,000 కోట్ల రూపాయల వ్యయంతో 2020 డిసెంబర్ 21వ తేదీన భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టింది. డ్రోన్ టెక్నాలజీతో మొత్తంగా 50 అంశాల్లో 10,158 మందికి సర్వే కోసం శిక్షణ సైతం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4,500 సర్వే బృందాలను ఏర్పాటు చేసింది అప్పట్లో జగన్ ప్రభుత్వం. ఇప్పుడు దీని పేరును ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్టుగా పెట్టింది.












Click it and Unblock the Notifications