Chandrababu Release: జైలుకు లోకేష్, బ్రాహ్మణి- చంద్రబాబు విడుదల కాగానే హైదరాబాద్ కు..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో ఇవాళ విడుదల కానున్నారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని రాజమండ్రి జైలు అధికారులకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కాపీ అందిన తర్వాత రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయన తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు.

స్కిల్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఇవాళ హైకోర్టు తీర్పు వస్తుందన్న సమాచారం ఉండటంతో ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఉదయాన్నే చేరుకున్నారు. హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తెలియగానే జైలుకు వెళ్లి ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు వీరిద్దరూ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి యాత్రను ప్లాన్ చేసుకున్న చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా రాజమండ్రి చేరుకునే అవకాశం ఉంది.
మరోవైపు చంద్రబాబు విడుదల నేపథ్యంలో రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్, నారా బ్రాహ్మణి టీడీపీ క్యాంపు వద్ద వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు కి బెయిల్ వచ్చిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించగా.. ఆయన యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యింది అని నాయకులు, కార్యకర్తలతో వ్యాఖ్యానించారు. చంద్రబాబు విడుదల తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది.

అటు చంద్రబాబు సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాక అక్కడి నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకునే అవకాశం ఉంది. సమయం కుదరకపోతే మాత్రం నేరుగా ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అక్కడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో మరో రెండు రోజుల్లో చంద్రబాబు కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications