పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు మరో కీలక నిర్ణయం..! 2029కి రోడ్ మ్యాప్..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్ల పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ సర్కార్ అందించిన పెన్షన్ల స్ధానంలో కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితో వీటిని అందజేస్తోంది. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఇకపై ప్రతీ నెలా ఒకటో తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర స్ధానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అంతే కాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పొద్దని తేల్చిచెప్పేసారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రతీ నెలా ఒకటో తేదీ ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకుని పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. తద్వారా 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని, ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని కూడా బాబు ఆదేశించారు.
ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని మరో ఆదేశం ఇచ్చారు. ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలని, కార్యకర్తలకు అండగా నిలబడాలని, వారికి తగిన సాయం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications