కాపులకు సీఎం ? రెడ్డి, యాదవలకు డిప్యూటీ సీఎంలు ? చంద్రబాబు తాజా స్ట్రాటజీ ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ఓవైపు తన పార్టీని క్షేత్రస్దాయిలో బలోపేతం చేసుకుంటూనే మరోవైపు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందుకోసం కొత్త సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్ అమలుచేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా కీలక పదవిని తాత్కాలికంగా అయినా త్యాగం చేసేందుకు టీడీపీ అధినేత ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

చంద్రబాబు సంచలన వ్యూహాలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రయత్నిస్తున్న విపక్ష నేత చంద్రబాబు ఈ ప్రయత్నంలో భాగంగా సంచలన వ్యూహాల్ని తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా కులసమీకరణాలతో కునారిల్లుతున్న రాష్ట్రంలో అదే కుల సమీకరణాల్ని రూటుమార్చి ప్రయోగించడం ద్వారా గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ వేసిన సోషల్ ఇంజనీరింగ్ పాచికకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నింటికంటే మించి సంక్షేమంపై వచ్చే ఎన్నికల్లో చర్చ జరగకుండా కొత్త అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. దీంతో చంద్రబాబు వ్యూహాలపై ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చ సాగుతోంది.

కాపులకు సీఎం పదవి ?
ఉమ్మడి ఏపీలోనే కాపులకు సీఎం పదవి తెరపైకి వచ్చింది. దశాబ్దాల క్రితమే వంగవీటి మోహనరంగా దూకుడు చూస్తే రాష్ట్రంలో దాదాపు 20 శాతానికి పైగా ఉన్న కాపులు సీఎం కావడం కష్టమేమీ కాదన్న వాదన వినిపించింది. అదే ఆయన ప్రాణం తీసిందనే వాదన కూడా ఉంది. ఆ తర్వాత కూడా దాసరి, చిరంజీవి వంటి వారు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు బీజేపీ కూడా సహకరిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కాపు నేతకు సీఎం పదవి కట్టబెట్టేందుకు చంద్రబాబు మానసికంగా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెక్ పెట్టాలంటే తాను సీఎం రేసు నుంచి తప్పుకుని కాపు నేతకు సీఎం పదవి ఆఫర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

డిప్యూటీలుగా రెడ్డి, యాదవులు ?
గతంలో అధికారంలో ఉన్నప్పుడు సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప రూపంలో కాపులకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన చంద్రబాబు.. ఈసారి కాపులకు సీఎం పదవే ఆఫర్ చేసే అవకాసాలున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంలుగా రెడ్డి, యాదవ సామాజిక వర్గాలకు పదవులు ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం అధికారంలో ఉంది. వీరిలో చాలా మంది అధికారం కోసమే టీడీపీని వీడి వైసీపీలో చేరిన వారు కూడా ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు రెడ్లకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీసీ సామాజిక వర్గమైన యాదవులకు కూడా మరో డిప్యూటీ సీఎం ఆఫర్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో చూస్తే జగన్ తొలి కేబినెట్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కు జలవనరుల మంత్రి పదవి దక్కింది. రెండో కేబినెట్లో యాదవులకు చోటు దక్కలేదు. దీంతో ఈ సామాజిక వర్గానికి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేయడం ద్వారా వారితో పాటు మిగతా బీసీల్ని ఆకట్టుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

షేరింగ్ పద్ధతిలో పదవులు ?
ప్రస్తుతం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు భావిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో రెడ్లు మినహాయిస్తే మిగతా సామాజిక వర్గాలైన కాపులకు సీఎం, యాదవులకు డిప్యూటీ తొలిసారి మాత్రమే. దీంతో ఐదేళ్ల పాలనలో తొలి రెండున్నరేళ్లు ఈ సమీకరణం అనుసరించి, రెండో టర్మ్ లో గతంలో అనుసరించిన కమ్మ సీఎం, కాపు, బీసీ డిప్యూటీ సీఎం ఫార్ములాల్ని అనుసరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తద్వారా గోదావరి జిల్లాల్లో కాపులతో పాటు రాయలసీమ జిల్లాల్లోని బలిజ, ఒంటరి కులాల ఓట్లు గంపగుత్తగా టీడీపీవైపు మళ్లుతాయని భావిస్తున్నారు. అలాగే గతంలో తమకు అండగా ఉండి ఆ తర్వాత వైసీపీ వైపు మొగ్గిన కీలక యాదవ సామాజిక వర్గం తిరిగి తమవైపు మొగ్గు చూపుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ అజెండాకు చంద్రబాబు చెక్ ఇలా ?
వచ్చే ఎన్నికల్లో రాజధానుల అంశంతో పాటు సంక్షేమాన్ని ఎన్నికల అజెండాగా మార్చుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో రాజధానుల అంశం ఎవరి చేతుల్లోనూ లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా ఇప్పటికిప్పుడు రాజధానుల నిర్మాణం సాధ్యం కాదు. దీంతో రాజధానుల వ్యవహారం వైసీపీకి మైనస్ అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీంతో సంక్షేమ అజెండాను దారి మళ్లించేందుకు సంచలన కులసమీకరణాల్ని తెరపైకి తీసుకురావాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం తప్పనిసరి కాబట్టి కులాల ఆధారంగానే ఓట్లు కురవాలనేది చంద్రబాబు ప్లాన్ గా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications