బాధ్యత పెరిగింది: చంద్రబాబు, ఏపీ తర్వాత తెలంగాణ నేతలతో...
హైదరాబాద్: పార్టీని పటిష్ఠం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కార్యకర్తలతో కలిసి పని చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. శనివారం నాడు పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని చంద్రబాబు లేక్ వ్యూ అతిథి గృహంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
కార్యకర్తల మనోభావాలను, ప్రజాసమస్యలను ఆలకించాలని, తరచూ పార్టీ కార్యాలయాలకు వస్తుండాలని, ప్రభుత్వ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పథకాలను ప్రచారం చేయాలన్నారు. పార్టీ సభ్యత్వం అరకోటి దాటిందని, దాంతో నేతలపై బాధ్యత పెరిగిందని, అంతా అప్రమత్తంగా ఉండాలని నేతలకు హితవు పలికారు. రాత్రి ఏడు గంటల వరకూ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను సమీక్షించిన చంద్రబాబు తర్వాత తెలంగాణ వ్యవహారాలను సమీక్షించారు.

ప్రభుత్వానికీ, ప్రజలకు వారధిగా ఉన్న పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు చెప్పారని పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని వారం రోజుల పాటు సేకరించాలని సూచించినట్టు చెప్పారు.
కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల సందర్భంగా రూపొందించిన మేనిఫెస్టోను అమలుచేస్తున్నామన్నారు. ప్రజాపక్షాన తమ పార్టీ పనిచేస్తుందని, ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications