పూర్వజన్మ బంధం, నేనూ ఫాలో అయ్యా: చంద్రబాబుపై ఉమాభారతి ఆసక్తికరం
న్యూఢిల్లీ: ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఫాస్ట్‌ట్రాక్ సీఎం అంటూ కొనియాడారు. ఏపీ నీటి ప్రాజెక్టులపై విషయమై ఆదివారం సీఎం చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు.
అనంతరం ఉమాభారతి మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతూ... చంద్రబాబు ఫాస్ట్ ట్రాక్ సీఎం అని అన్నారు. ఆయన పని చేసే విధానం తనకెంతో ఇష్టమని చెప్పారు. చంద్రబాబు అనుకున్నది సాధిస్తారని తెలిపారు.
తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా లేరని, కానీ తాను ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నానని ఉమాభారతి తెలిపారు. చంద్రబాబులాగే పని చేసినట్లు చెప్పారు.

అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీకి కూడా చంద్రబాబు పనితీరు గురించి చెప్పినట్లు ఆమె తెలిపారు. చంద్రబాబునాయుడు తనకు సోదరుడి లాంటివారని అన్నారు.
చంద్రబాబును చూసినప్పుడల్లా తమ ఇంట్లో వ్యక్తిని చూసినట్లే అనిపిస్తుందని తెలిపారు. అంతేగాక, తమ ఇద్దరి నడుమ పూర్వజన్మలో ఏదో అనుబంధం ఉన్నట్లుగా ఉందని ఉమాభారతి చెప్పారు.
కాగా, ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రితో చంద్రబాబు చర్చించారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు మరిన్ని నిధులు అవసరమవుతాయని చెప్పారు. 2018లోగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications