కృపామణి ఆత్మహత్య కేసు: చంద్రబాబు ఆరా, ఇతర మహిళలపై నిందితుడు వేధింపులు?
అమరావతి: తల్లిదండ్రులు, సోదరుడు మరో రౌడీ షీటర్ వేధింపుల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో కృపామణి అనే గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ఆరా తీశారు. కేసు పూర్వపరాలు తెలుసుకున్న సీఎం, కృపామణి ఆత్మహత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారం విజయవాడలోని తన నివాసం నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీసుల పనితీరుపై ఆయన సమీక్షించారు. గత ఐదేళ్లలో నేరాల నియంత్రణలో ఆయా అధికారులు ట్రాక్ రికార్డు, పనితీరు వంటి అంశాలంపై నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
ఆత్మహత్యకు ముందు కృపామణి రికార్డు చేసిన సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నాలుగు రోజులు గడుస్తున్నా ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదివారం వేల్పూరును సందర్శించారు.

కృపామణి భర్తతో మాట్లాడిన ఠాకూర్, కేసుపై పోలీసులతోనూ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన తణుకులో మీడియాతో మాట్లాడుతూ 15 రోజుల్లోగా చార్జీషీటు దాఖలు చేస్తామని తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు ఆయన తెలిపారు.
కృపామణి ఆత్మహత్య కేసు ఉదంతమిదీ:
కృపామణిని వ్యభిచారం కోసం గుడాల శ్రీనివాస్ అనే వ్యక్తికి రూ. 7 లక్షలకు అమ్మినట్లు ఆమె భర్త పవన్ చెప్పాడు. తన భార్య మంచిదని, ఆమె తల్లి వల్లే కృపామణి ఆత్మహత్య చేసుకున్నదని ఆవేదన చెందాడు. పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత కృపామణి ఆత్మహత్య కేసులో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వేల్పూరులోని స్థానిక నేత గుడాల సాయిశ్రీనివాస్‌కు కృపారాణిని తల్లిదండ్రులు రూ.7 లక్షలకు విక్రయించారు. కృపామణితో వ్యభిచారం చేయించాలనే ఉద్దేశంతోనే సాయిశ్రీనివాస్ కొనుగోలు చేశాడు. వ్యభిచారం చేయాలని కృపామణిని అతడు తీవ్రంగా వేధించాడు. తాను చెప్పినట్టు వినకపోతే నగ్న వీడియోలను నెట్‌లో పెడుతానని సాయిశ్రీనివాస్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
గతంలోనూ వేధింపులు తాళలేక తల్లిదండ్రులు, సాయిశ్రీనివాస్‌పై కృపామణి కేసు పెట్టింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా బెయిల్‌పై వచ్చి తర్వాత కూడా కృపామణిని నిందితులు వేధింపులకు గురిచేశారు. అప్పటి నుంచి కృపామణికి వేధింపులు మరింత పెరిగాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.
తల్లిదండ్రులు, సోదరుడు వ్యభిచారంలోకి దింపాలని చూస్తున్నారనే మనస్థాపంతో మంగళవారం కృపామణి వేల్పూరులోని ఓ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications