పాచి ఆహారం: 20 ఏళ్లలో చూడని వర్షాలు, బాబు ఏరియల్ సర్వే (ఫోటోలు)
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. నెల్లూరు నగరంలోని పలు కాలనీలతో పాటు జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి.
గురువారం ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. పదిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో నెల్లూరు, కడప తదితర జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమయింది. భారీ వర్షాల నేపథ్యంలో పెన్నా నది సహా అన్నింటిలోకి వరద నీరు నిండుతోంది. వర్షాల వల్ల ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు.
నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు, ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటిలో చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పలు గ్రామాలకు ఆహార పొట్లాలు అందలేదు. మనుబోలు మండలం కొలనుకొదురు గ్రామంలో ఆహారపొట్లాలు పాచిపోయి, గ్రామస్తులు వాంతికి చేసుకున్నరు. చిలకూరు మండలంలో కూలీలు వరద నీటిలో చిక్కుకుకున్నారు. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు విహంగ వీక్షణం
రాష్ట్రంలో వర్షాల వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ అప్రమత్తం చేశామని, నిత్యం పర్యవేక్షిస్తున్నామని, ఇంతటి వర్షాన్ని ఎన్నడూ చూడలేదని, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటి మీటర్లుపైగా వర్షం కురిసిందని, భూగర్భ జలాలు పెరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు విహంగ వీక్షణం
నదులు, చెరువులు కంటలు నిండాయని, రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో రాకపోకలకు ఆటంకం కలిగిందని, వీటిని పునరుద్ధరిస్తున్నామని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని, దెబ్బతిన్న రహదారులను ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, వర్షాలు వలన తలెత్తిన నష్టంపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని, తిరుమల ఘాట్‌రోడ్‌ని సరిదిద్దే చర్యలకు నిపుణుల కమిటీని నియమించామని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు విహంగ వీక్షణం
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విస్తృతంగా పర్యటించారు. వైమానికదళ హెలికాప్టర్లో గంటపాటు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒకవైపున వర్షం పడుతున్నా వాతావరణం సరిగ్గా అనుకూలించకున్నా సీఎం మాత్రం పట్టుదలతో హెలికాప్టర్లో ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

చంద్రబాబు విహంగ వీక్షణం
చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 12.45 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. వైమానికదళ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వేకి సిద్ధమయ్యారు. హోంమంత్రి చినరాజప్ప, వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జిల్లాలోని పరిస్థితిని వివరించారు. రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ తదితరులు ఆయన వెంటరాగా హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు. ముందుగా ఏర్పేడు మార్గాన్ని పరిశీలించారు.

చంద్రబాబు విహంగ వీక్షణం
అనంతరం శ్రీకాళహస్తి పట్టణాన్ని, నీటమునిగిన ప్రాంతాలను చూశారు. స్వర్ణముఖినది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నతీరును పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని.. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి బొజ్జల చెప్పారు.

భారీ వర్షాలు
రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసిన అల్పపీడనం జల ప్రళయాన్ని సృష్టించింది. బుధవారం నాటికి అల్పపీడనం తగ్గుముఖం పట్టినా, నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు భారీ నష్టాన్ని చవిచూశాయి.

భారీ వర్షాలు
లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిపోగా, వందల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు రాకపోకలు తెగిపోయాయి. చెరువులు, వాగులకు గండ్లు పడటంతో వరద నీరు సమీప గ్రామాలను ముంచెత్తుతోంది.

భారీ వర్షాలు
భారీ వర్షాల కారణంగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు మరణించారు. వరదల్లో రెండు మృతదేహాలు కొట్టుకురాగా, మరొకరు గల్లంతయ్యారు.

భారీ వర్షాలు
తిరుమల కొండపై చలిగాలుల తీవ్రత అధికం కావడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

భారీ వర్షాలు
చిత్తూరు జిల్లాలో 45 చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లాలో 10,382 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో సుడిగాలి పర్యటన జరిపిన మంత్రి గంటా శ్రీనివాస రావు ఎనిమిది కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. జిల్లాలో మూడువేల హెక్టార్లు, నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.

భారీ వర్షాలు
గోదావరి జిల్లాల్లో నాలుగు లక్షల హెక్టార్లలో పంట నీటమునిగింది. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

భారీ వర్షాలు
తూర్పు గోదావరి జిల్లాలో వరి పంట నష్టం విలువ 100 కోట్ల పైమాటే. వర్షాల వల్ల తీవ్రంగా నష్టానికి గురైన నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఏరియల్ సర్వే జరిపారు.

భారీ వర్షాలు
నెల్లూరు జిల్లాలోని ముంబయి జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. మనుబోలు వద్ద గండి పడటంతో రెండోరోజూ చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షాలు
భారీ వర్షాల కారణంగా విజయవాడ - చెన్నై రైలుమార్గంలో బుధవారం 18 రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. గూడూరు - చెన్నై మార్గంలో తడ - సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ల మధ్య 167వ వంతెనపై ప్రమాద స్థితికి వరదనీరు చేరింది. వర్ష బాధిత జిల్లాల్లో మంత్రులు పర్యటించి సహాయ చర్యలను సమీక్షించారు.
రైతాంగాన్ని ఆదుకోండి: బొత్స
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, వారిని ఆదుకోవాలని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. వర్షాలతో జాతీయ రహదారులు బాగా దెబ్బతిన్నాయని, ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోందన్నారు. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications