ఖర్చులన్నీ పెట్టాం చూసుకో!: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు మళ్లీ కౌంటర్
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా గురువారం మరోసారి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు వివరాలన్నింటిని ఆన్‌లైన్‌లో పెట్టామని, వాటిని చెక్ చేసుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత ఆశయమని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఉన్న అపోహలు అన్నీ తొలగిపోయాయని చెప్పారు.

కొందరు కావాలనే రాద్దాంతం
కొందరు మాత్రం కావాలనే పోలవరం ప్రాజెక్టుపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆయన వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై ఉడుంపట్టి పట్టానని, ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వదిలి పెట్టేది లేదన్నారు.

చెక్ చేసుకోండి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులు అన్నింటినీ ఆన్‌లైన్‌లో పెట్టామని చంద్రబాబు చెప్పారు. శ్వేతపత్రాలు అడిగేవారు అక్కడ చెక్ చేసుకోవచ్చునని పవన్ కళ్యాణ్, వైసీపీ నేతలను ఉద్దేశించి సూచించారు. ఇటీవల ఏపీ పర్యటనలో భాగంగా పోలవరం సందర్శించిన పవన్ శ్వేతపత్రం అడిగిన విషయం తెలిసిందే.

చంద్రబాబుకు సన్మానం
కాగా, చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని గురువారం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంశీ, బచ్చుల అర్జునుడు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో హనుమాన్ జంక్షన్ వద్ద చంద్రబాబుకు సన్మానం చేశారు.

మా కుటుంబం కోసం చిన్న కంపెనీ ప్రారంభించా
ఈ సందర్భంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై గడ్కరీతో చర్చించానని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుకు చేసిన ప్రతి పైసా ఖర్చు ఆన్‌లైన్లో ఉందన్నారు. ఏ కంపెనీకి వెళ్తుందో కూడా ఆన్ లైన్లో పెడుతున్నామన్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించడం సరికాదన్నారు. తన కుటుంబం కోసం చిన్న కంపెనీని ఎప్పుడో ప్రారంభించానని చెప్పారు. కంపెనీని వారు బాగా చూసుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications