సోము వీర్రాజుకు చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్, మోడీని కలవడంపై ఇలా
అమరావతి: నిత్యం తనను, తెలుగుదేశం పార్టీని టార్గెట్‌గా చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో హుందాగా ఉండటం ముఖ్యమని చెప్పారు.
Recommended Video

ఆయన మంగళవారం ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తి లేదని, పార్లమెంటు వేదికగా పోరాడలని వారికి సూచించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీంతో చంద్రబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

హుందాగా వ్యవహరించాలి
రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. హుందాగా లేని వారి వ్యాఖ్యలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వారి రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. వారి వ్యాఖ్యలపై ప్రజలు స్పందిస్తారన్నారు. మనం (టీడీపీ) మాత్రం ఏపీ ప్రయోజనాల కోసం ఉద్యమించాలన్నారు.

టీడీపీపై సోము వీర్రాజు నిప్పులు
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిత్యం చంద్రబాబును, టీడీపీని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీలోని ఓ వర్గం ఏపీలోని అధికార పార్టీపై నిత్యం నిప్పులు చెరుగుతోందనే వాదనలు ఉన్నాయి. అందులో సోము వీర్రాజు ముఖ్యులు. కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వీర్రాజు కూడా అంతే ఘాటుగా స్పందించారు.

ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం
దీంతో సోము వీర్రాజు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు సోమవారం రంగంలోకి దిగి, వీర్రాజు మాటలు ఎవరూ పట్టించుకోవద్దన్నారు. ఆయన మాటలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దీంతో టీడీపీ నేతలు మాటల దాడిని ఆపేశారు.

ఆదేశాల తర్వాత బాబు ఇలా
తాజాగా, మంగళవారం ఎంపీలతో భేటీ సందర్భంగా సోము వీర్రాజు అంశం చర్చకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు పైవిధంగా సూచన చేశారు. అలాంటి వారిని ప్రజలు చూసుకుంటామని, ఏపీ ప్రయోజనాల కోసం మీరు పోరాడండని సూచించారు.

మిత్రధర్మం పాటిస్తున్నామని టీడీపీ
టీడీపీ మిత్రధర్మాన్ని పాటిస్తోందని, పార్టీ నాయకులు అందరూ దానికి కట్టుబడి ఉండాలని టీడీపీ అధిష్టానం సోమవారం పార్టీ నేతలకు ఆదేశించింది. వ్యక్తిగత విమర్శల విషయంలో సంయమనం పాటించాలన్నారు. బీజేపీకి, టీడీపీకి మధ్య తేడా ఉండాలని, వారేదో మాట్లాడుతున్నారని, మనం అలా మాట్లాడవద్దన్నారు. వీర్రాజు దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు. ఇదిలా ఉండగా, టీడీపీ నేతలు ప్రధాని మోడీని కలవడంపై సోము వీర్రాజు సాయంత్రం స్పందించారు. ఇది శుభపరిణామం అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి పరిశ్రమలు వంటివి వస్తాయని చెప్పడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications