కేసీఆర్ బాటలో చంద్రబాబు: టీకి కేటీఆర్‌లా.. ఏపీకి నారా లోకేష్!
అమరావతి: మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తన తనయుడు కేటీ రామారావుకు ఏవైతే శాఖలు కేటాయించారో.. అవే శాఖలను ఏపీ మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబునాయుడు తన తనయుడు నారా లోకేష్‌కు కేటాయించడం గమనార్హం.

కేసీఆర్ బాటలోనే..
ఆదివారం మంత్రివర్గ విస్తరణలో పలువురికి చోటు కల్పించిన చంద్రబాబు.. సోమవారం వారికి శాఖలను కేటాయించారు. ఎమ్మెల్సీగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నారా లోకేష్‌కు తెలంగాణలో కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కు ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలను కేటాయించారు.

కేటీఆర్‌లా లోకేష్
ఐటీ శాఖతోనే తెలంగాణలో కేటీఆర్‌కు మరింత ఇమేజ్ వచ్చిందనే కారణంగా నారా లోకేష్‌కు కూడా ఐటీ శాఖ అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్.. పలు ఐటీ పరిశ్రమలను హైదరాబాద్‌కు తీసుకురావడంలో సఫలీకృతులైనట్లే చెప్పవచ్చు.

లోకేష్ ఏమేర రాణిస్తారో...
అయితే, నారా లోకేష్ ఏమేర రాణిస్తారనేది త్వరలోనే తెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. కేటీఆర్ తనకంటే సీనియర్ అని, ఆయనతో తనకు పోటీ ఏంటని అన్నారు. ఏపీ ఐటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

పల్లెను తొలగించిన చంద్రబాబు..
కాగా, గతంలో ఏపీలో ఐటీ శాఖ నిర్వహించిన పల్లె రఘునాథ రెడ్డిని చంద్రబాబు మంత్రివర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ శాఖనే నారా లోకేష్‌కు కేటాయించారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications