బాబు ఆఫర్: బీజేపీకి ఎమ్మెల్సీ, అమిత్ షా ఓకే..!
అమరావతి: గతేడాది సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం, బీజేపీల మధ్య బంధం మరింతగా బలోపేతం కానుంది. ఏపీలో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులను ఇచ్చిపుచ్చుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లను పంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు సీట్ల సర్దుబాటుకు దాదాపుగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు స్ధానాలు దక్కనున్నాయి. వీటిలో ఒక సీటుని బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు అమిత్ షా కూడా అంగీకరించారట.

ఏపీ బీజేపీ నేతలు మాత్రం రెండు ఎమ్మెల్సీలు కావాలని అమిత్ షా ముందు అడిగినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సమ్మతించని చంద్రబాబు టీడీపీలో కూడా చాలా మంది ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారని, 2017లో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేలా చూస్తామని చెప్పారంట.
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.... ఏపీలో బీజేపీకి ఇచ్చే ఈ ఎమ్మెల్సీ స్ధానంలో ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సీనియర్ నేత సోము వీర్రాజుకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఢిల్లీలోని అమిత్ షా ఇంట్లో అరగంటకు పైగా సాగిన భేటీలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభపాటి హరిబాబు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications