ముద్దుల పోటీనా, చాక్లెట్ ఇవ్వని డాడి.. మోడీ నుంచి జగన్ దాకా: మహానాడులో పడిపడి నవ్విన చంద్రబాబు
Recommended Video

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో తెలంగాణకు చెందిన పార్టీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును పడిపడి నవ్వించారు. చంద్రబాబుతో పాటు మహానాడు వేదిక పైన ఉన్న, హాజరైన కార్యకర్తలు పడిపడి నవ్వారు.
నన్నూరి నర్సిరెడ్డి చాలా చలాకీగా మాట్లాడుతారు. మహానాడులోను తన వాక్చాతుర్యం చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఆయన వదిలిపెట్టలేదు. తనదైన శైలిలో వాగ్భాణాలు విసిరారు. దీంతో చంద్రబాబు బాగా నవ్వుకున్నారు.

నరేంద్ర మోడీపై నన్నూరి సెటైర్
తాము అచ్చేదిన్ తెస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు చెప్పారని, కానీ ఆయన తెచ్చింది అచ్చేదిన్ కాదని దేశానికి చచ్చేదిన్ తెచ్చారని నన్నూరి అన్నారు. మోడీ బ్యాంకులను ఊడ్చే పనిలో బీజీగా ఉన్నారని విమర్శించారు. పిల్లలకు ఆశ పెట్టి చాక్లెట్ ఇవ్వని తల్లిదండ్రులతో ప్రధాని మోడీని పోలుస్తున్నారని ఎద్దేవా చేశారు.

జగన్‌పై నన్నూరి సెటైర్
వైసీపీ అధినేత వైయస్ జగన్ చేస్తోన్న పాదయాత్ర ముద్దుల పోటీనా లేక గుద్దుల పోటీనా అర్థం కావడం లేదని నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. జగన్ గుడిని, గుడిలో హుండీని ఎత్తుకు పోయే రకం అన్నారు. చనిపోతూ తన తండ్రి తనకు సీబీఐ కేసులు ఇచ్చి వెళ్లారని జగన్ ఫీలవుతున్నారన్నారు. ఆయనజగన్ కుర్చీ కోసం వేచి చూస్తున్నారని ఓ కథ కూడా చెప్పి ఆకట్టుకున్నారు. ఈ మధ్య తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ కూర్చొని మాట్లాడుకున్నారని, ప్రజల కోసం మనం ఏమైనా చేద్దామని స్వామి వారు అన్నారని, దానికి మంగమ్మ సరేనని చెప్పారని, అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి, మంగమ్మలు భక్తులు వచ్చినప్పుడల్లా గర్భగుడిలోని కుర్చీలో నుంచి లేస్తున్నారని, కానీ జగన్ ఇటీవల వచ్చినప్పుడు మంగమ్మ లేవగా, స్వామివారు లేవలేదని, ఎందుకు అని అడగ్గా.. జగన్ కుర్చీలేకుండా తిరుగుతున్నాడని, మనం లేస్తే ఆయన ఇందులో కూర్చుంటాడని మంగమ్మకు చెప్పారన్నారు.

బీజేపీ పైజామానే పగిలేది
విజయసాయి ఎక్కువ మాట్లాడినా, జగన్ ఎక్కువ నడిచినా పగిలేది బీజేపీ పైజామా అనే విషయం గుర్తు పెట్టుకోవాలని నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. ఇటీవల తాను చంద్రబాబును కలిసేందుకు అమరావతి వచ్చానని, అప్పుడు జగన్ పాదయాత్ర చూద్దామనుకున్నానని, ఆయన నుదుటికి ముద్దులు పెడుతున్నారని, వీపులో చేతులు పెడుతున్నారన్నారు. జగన్ లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. బ్రాహ్మణి స్టీల్స్, కర్ణాటక, సిక్కింలలో పవర్ ప్రాజెక్టులు, సాక్షి పత్రిక, బెంగళూరులో 250 కోట్ల షాపింగ్ కాంప్లెక్స్, హైదరాబాదులో ఆస్తులు నీ అయ్య జాగీరా జగన్ అని ప్రశ్నించారు.

బీజేపీ ఏం చేయలేక కొత్త నటులను రంగంలోకి దింపుతోంది
కాగా, రెండో రోజు మహానాడుకు 35వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. కేంద్రం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీకి బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రస్తుతం వైసీపీ ఐసీయూలో ఉందనిని, దానికి బీజేపీ ఆక్సిజన్ అందిస్తోందన్నారు. ప్రజలు పొరపాటున వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు. బీజేపీ తాను సొంతగా ఏమీ చేయలేక కొత్త నటులను, కుల సంఘాలను రంగంలోకి దించుతోందన్నారు.

అమిత్ షాపై టీడీపీ నేతల ఆగ్రహం
అమరావతికి నిధులు ఇచ్చామన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వ్యాఖ్యలపై చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులు తీవ్రంగా స్పందించారు. అమరావతిలో పనులే ప్రారంభం కాలేదని చెప్పడం దారుణమన్నారు. యూసీలు పంపిస్తే నిజమైనవి కావని ఆరోపిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చేసినట్లు బుకాయిస్తారా అని ప్రశ్నించారు. అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నారాయణ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications