ఏపీకి తొందరగా న్యాయం చేయండి: బాబుతో భేటీ తర్వాత 'మోడీ'కి అద్వానీ
న్యూఢిల్లీ: విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ శుక్రవారం నాడు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అద్వానీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ పైవ్యాఖ్యలు చేశారు.
అద్వానీ ఇంకా మాట్లాడుతూ.. ఏపీకి న్యాయం కావాలన్నారు. గత యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రత్యేక హోదా పైన నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. అద్వానీ వ్యాఖ్యలు మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవేనా అనే చర్చ సాగుతోంది. కాగా, కృష్ణా పుష్కరాలకు చంద్రబాబు ఆయనను ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రమంత్రులను కలుస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రధానితో ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రధానితో భేటీలో చంద్రబాబుతో కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతి రాజు, రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రితో చంద్రబాబు దాదాపు అరగంట పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సమయంలో పలు అంశాలు చర్చించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications