మీకు అన్యాయం చేయను: విశాఖకు బాబు, జెండా ఆవిష్కరించకుండా వెళ్లారు
విశాఖ: విశాఖపట్నంకు తప్పకుండా రైల్వే జోన్ వస్తుందని, ఈ ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లోను అన్యాయం చేయనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు అన్నారు. విజయవాడకు రైల్వే జోన్ వెళ్లే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విశాఖకే రైల్వే జోన్ వస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కింద వచ్చే ప్రయోజనాలను కేంద్రం ఇస్తామని చెప్పిందని ముఖ్యమంత్రి అన్నారు. తాను ఏ విషయంలోను రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుకు యువతే కీలకమన్నారు. ఐటి అభివృద్ధి దిశగా విద్యార్థులు కొత్తగా ఆలోచించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చరిత్రలో నిలిచిపోతామని వ్యాఖ్యానించారు.

జెండా ఆవిష్కరించకుండా వెళ్లిన బాబు, వెంకయ్య
విశాఖపట్టణం విమానాశ్రయంలో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించకుండానే సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెళ్లిపోయారు. జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించడంలో భాగంగా సదరన్ రీజియన్లోని అన్ని విమానాశ్రయాల్లో బుధవారం జాతీయ జెండాలు ఆవిష్కరించాలని కేంద్రంఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగానే విశాఖ విమానాశ్రయం ప్రాంగణంలోని గార్డెన్‌లో 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉన్న భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. విశాఖలో బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు, వెంకయ్యతో ఈ జెండాను ఆవిష్కరించాలని భావించారు.
షెడ్యూల్ కూడా పొందుపరిచారు.అయితే, తొలుత విమానాశ్రయంలో దిగిన వెంకయ్య పాత టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చారు. బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఊరేగింపుగా నగరంలోకి వెళ్లిపోయారు. అనంతరం ప్రత్యేక విమానంలో వచ్చిన చంద్రబాబు, కలెక్టర్ సహా ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిక్స్ సదస్సుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత విమానాశ్రయ అధికారులు ఫోన్ చేస్తే వారు బిజీగా ఉన్నట్లు చెప్పారు.
వరద బాధితులకు సీఎం తక్షణ సాయం
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాల్లోని ప్రజలకు సీఎం చంద్రబాబు తక్షణ సాయం ప్రకటించారు. వెయ్యి కుటుంబాలకు 20 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. 500 కుటుంబాలకు రూ.1500ల విలువైన దుస్తులు, ఇంటి సామగ్రి కోసం రూ.2 వేలు చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీచేశారు.












Click it and Unblock the Notifications