అమరావతి కోసం బ్రిటన్, సంతోషం: చంద్రబాబు, ఐదు విభాగాలుగా ఏపీ
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు బ్రిటన్ లాంటి దేశం ముందుకు రావడం తనకెంతో సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం తిరుపతిలో జరగుతున్న రెండు రోజుల టీడీపీ పార్టీ దిశానిర్దేశ సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన బ్రిటన్‌కు తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. 2002 నాటికి భారత్‌లోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలవాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఐదేళ్లు పడుతుందని, అందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆరునెలల్లో పూర్తిచేసి, కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద చేపట్టిన కార్యక్రమాలను ఎప్పుడూ కొనసాగించాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
హంద్రీనీవా పథకం ద్వారా జూన్ నాటికి చిత్తూరుకు నీరందించి తీరుతామని, మిగతా ప్రాజెక్టుల ద్వారా సీమలోని అన్ని చెరువులకూ నీరు చేరుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తన పాలనపై విపక్షాలు అనవసర రాద్ధాంతం, అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఏ ప్రాజెక్టు నిర్మాణంలోనూ అవినీతికి తావులేకుండా చేస్తానని, తనకు అనుమానం వస్తే, రాత్రిళ్లు అక్కడే పడుకుంటానని బాబు హెచ్చరించారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా చేయడం కోసం అహర్నిశలూ శ్రమిస్తానని ఆయన తెలిపారు. కాగా, ఏపీలోని 13 జిల్లాలను ఐదు భాగాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఐదు విభాగాలుగా అంజనాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, గరుడాద్రిగా పేరు పెట్టారు.
* గరుడాద్రిలో శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి
* వెంకట్రాద్రిలో విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా
* నారాయణాద్రిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
* శేషాద్రిలో కడప, అనంతపురం
* అంజనాద్రిలో కర్నూలు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications