నాకు పదవిపై ఆశ లేదు: బాబు, శిల్పా, లబ్బి చేరిక
హైదరాబాద్: తనకు పదవులపై ఆశ లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాను 24 గంటలు ప్రజల గురించే ఆలోచన చేశానని ఆయన చెప్పారు. కాంగ్రెసు శాసనసభ్యులు లబ్బి వెంకటస్వామి, శిల్పా మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని పదవి చేపట్టాలని తనను అడిగితే తనకు రాష్ట్రం ముఖ్యమని చెప్పానని చంద్రబాబు అన్నారు. ఎన్టీ రామారావు వ్యక్తి కాదని, వ్యవస్థ అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనిని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ బరి తెగించి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈడి మొన్ననే 833 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసిందని, ఇంకా చాలా అక్రమాస్తులున్నాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కాంగ్రెసుకు ఓటేసినప్పుడు నష్టపోయిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పారు.

రాష్ట్రం ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని, చక్కదిద్దే సామర్థ్యం టిడిపికి మాత్రమే ఉందని, టిడిపిలో మంచి నాయకులున్నారని ఆయన అన్నారు. ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని అనిపిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి మాత్రమే మిగులుతుందని అన్నారు. ఓ సైకో నాయకుడితో పోరాటం చేయాల్సి వస్తుందని, అందుకు బాధగా ఉందని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
సైకో నాయకుడు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆయన ఆరోపించారు. తాను నీతినిజాయితీలతో బతికానని, అందువల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తనను ఏమీ చేయలేకపోయారని ఆనయన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలు కూడా తమ పార్టీకి మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు.
సోమవారం ఉదయం చల్లా రామకృష్ణా రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. చల్లా రాకతో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications