హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనే చేశానా... బాబు తెలంగాణం: చిరువల్లే, వైఎస్‌పై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మహానాడులో మాట్లాడారు. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండుగ అన్నారు. ఈ పండుగ టిడిపికే కాదని తెలుగుజాతికే పండుగ అన్నారు. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారికి పండుగే అన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు టిడిపి వైపు ఆసక్తికరంగా చూస్తున్నారని చెప్పారు. సీమాంధ్రలో టిడిపి విజయం కార్యకర్తల కృషి ఫలితమే అన్నారు. కేంద్రంలో టిడిపి సమర్థించిన ఎన్డీయే అధికారంలో ఉందని చెప్పారు.

తెలంగాణలో మంచి ఫలితాలు సాధించామన్నారు. ప్రజల కోసం పార్టీ పెడితే తప్ప... సొంత ప్రయోజనాల కోసం పార్టీ పెడితే ఒరిగేదేమీ లేదన్నారు. టిడిపి కేంద్రంలో కూడా చక్రం తిప్పిందన్నారు. తెలుగువారి హృదయాల్లో ఉన్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. ఆయన భావితరాలకు కూడా స్ఫూర్తి అన్నారు. టిడిపి హయాంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు నాంది పలికామన్నారు.

 Chandrababu Naidu speech in Mahanadu

టిడిపి పైన కుట్ర పన్నిన వారు భూస్థాపితమయ్యారని, చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. తాను సిఎంగా ఉన్నప్పుడు నాటి ప్రధాని వాజపేయి రాష్ట్ర అభివృద్ధికి సహకరించారని కొనియాడారు. దేశంలో ఎన్ని పార్టీలు ఉన్న టిడిపికి ఓ విశిష్టత ఉందన్నారు. టిడిపి ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదన్నారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి కోసం తహతహలాడే పార్టీ టిడిపి అన్నారు. ప్రజల కోసం పార్టీ పెట్టాలి తప్ప స్వార్థం కోసం కాదన్నారు.

హైదరాబాదులో ఇప్పుడున్న రోడ్లన్నీ టిడిపి హయాంలో వచ్చినవే అన్నారు. చదువు, తాగునీరు, సాగునీరు అంశాలకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. ప్రపంచంలోనే రాష్ట్రానికి గుర్తింపు తీసుకు వచ్చిన పార్టీ టిడిపి అన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టగలిగే పార్టీ టిడిపి తప్ప మరొకటి కాదన్నారు. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే.. సైబరాబాద్ మనం చేశామన్నారు. టిడిపి చేసిన అభివృద్ధి వల్ల హైదరాబాదుకు ఆదాయం పెరిగిందన్నారు.

విభజనపై..

రాష్ట్ర విభజన విషయంలో ప్రజల మనోభావాలు గుర్తించాలని టిడిపి మొదటి నుండి చెబుతోందన్నారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు సీమాంధ్రుల మనోభావాలు, సమైక్యంగా ఉంచాలనుకుంటే తెలంగాణ ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని సూచించామన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఎప్పుడూ చెబుతున్నామన్నారు. టిడిపిని లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ కుట్రకు పాల్పడిందన్నారు.

పివికి స్మారక స్థూపం

పివి నర్సింహా రావు పైన పోటీ పెట్టకుండా తెలుగు జాతి గౌరవం కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. పివికి ఓ మెమోరియల్ కట్టేందుకు కూడా యూపిఏ ముందుకు రాలేదన్నారు. ఎన్డీయే పాలనలో తాము ఢిల్లీలో పివికి స్మారక చిహ్నం కట్టించే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు టిడిపి శ్రీకారం చుట్టిందన్నారు. కాంగ్రెసు పైన రాజీలేని పోరాటం చేసింది టిడిపియే అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే ఆ పార్టీ పైన ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఆ పార్టీ రెండు పర్సెంట్ ఓట్లు దక్కించుకోలేదని, ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారన్నారు. తెలంగాణలోను కాంగ్రెసు పార్టీ కంటే మనమే మెరుగ్గా ఉన్నామని చెప్పారు. తొమ్మిదేళ్లలో టిడిపి హైదరాబాదును అభివృద్ధి చేసిందన్నారు. తన హయాంలో బిల్ క్లింటన్, బిల్ గేట్స్ మొదలు పారిశ్రామికవేత్తలు ఎందరో వచ్చారన్నారు.

కార్యకర్తలు, నాయకులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. పదేళ్ల తర్వాత కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే శక్తి టిడిపికే ఉందని ప్రజలు పట్టం కట్టారన్నారు. ఈ పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ వారు టిడిపిపై దౌర్జన్యం చేశారన్నారు. ఇతర పార్టీలు అయితే మనుగడ సాధించలేకపోయాయని, పట్టుదల కల్గిన కార్యకర్తల వల్లే మనుగడ సాధించామన్నారు. టిడిపి ఎప్పుడు కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. ప్రజా సమస్యల పైన పోరాడామన్నారు.

వైయస్‌పై నిప్పులు

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడామన్నారు. టిడిపిని బలహీనం చేయాలని వైయస్ పాలనలో మన కార్యకర్తలను చంపడం ప్రారంభించారని మండిపడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల రవిని అనంతపురం జిల్లా కార్యాలయంలో చంపేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. టిడిపిపై కక్ష సాధింపును తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లినా పెడ చెవిన పెట్టారన్నారు. టిడిపి కార్యకర్తలను చంపారని, అయినా తెలుగు తమ్ముళ్లు పారిపోలేదన్నారు.

చిరంజీవి వల్లే..

మృతి చెందిన టిడిపి కార్యకర్తల పిల్లలకు చదువులు చెప్పిస్తున్నామన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటే.. కార్యకర్తలు ఆస్తులను అమ్ముకున్నారని, వీటిని తాను ఎప్పుడు మర్చిపోలేనన్నారు. 2009లో మనం తప్పకుండా గెలవాల్సి ఉండెనని కానీ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిందన్నారు.

సమస్యలు ఎక్కడుంటే అక్కడ టిడిపియే ఉందన్నారు. ఉత్తరాఖండులో వరదలు వస్తే తెలుగు వారి కోసం టిడిపియే వెళ్లిందన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా మనమే వెళ్తున్నామన్నారు. అవినీతిపై టిడిపి ఎప్పుడు రాజీ పడలేదన్నారు. వైయస్ అవినీతి పైన పుస్తకం కూడా వేశామన్నారు. అవినీతిపై మొదటి నుండి పోరాడుతున్నామన్నారు. బాబ్లీ ప్రాజెక్టు కోసం తాను పోరాడానని, జైలుకు వెళ్లానని చెప్పారు. అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. తెరాస అప్పుడు పట్టించుకోలేదన్నారు.

తాను ఎన్నో సమస్యల పైన పోరాడానని, వాటి గురించి ఆలోచిస్తే ఈ పోరాటం చేసింది తానేనా అని ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఈ పోరాటాలు కార్యకర్తల పట్టుదల కారణంగానే చేశానని చెప్పారు. రైతులు బాగుపడాలంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడాలంటే వ్యవసాయం బాగుండాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు తాను రైతులకు అండగా ఉంటానని చెప్పారు. తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పారు.

English summary
Telugudesam Party chief Chandrababu Naidu speech in Mahanadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X