నాడు వైయస్, నేడు జగన్, నా దగ్గర డబ్బులేదు: బాబు ఆగ్రహం
విజయవాడ: ఒకప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైసిపి అధినేత జగన్ రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు అన్నారు. రైతుల కష్టాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో విడత రుణ మాఫీ పత్రాల పంపిణీని చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రుణ విముక్తి చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించడం విడ్డూరమన్నారు.

మీ సమస్యలు తెలుసుకోవడానికి ఎన్నికల ముందు పాదయాత్ర చేశానని, ఆ రోజున రైతుల ఇబ్బంది చూసి చలించిపోయానని, రైతులకు అప్పు అనే సమస్య తీవ్రంగా వెంటాడుతోందని గుర్తించానన్నారు. ఇప్పుడు మీ కష్టాలను తీర్చేందుకే కష్టపడుతున్నానని చెప్పారు.
తన దగ్గర డబ్బు లేదని, అప్పు చేయాలంటే భారత ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని, ఎన్ని కష్టాలున్నా రైతు రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. మనకు వచ్చే రెవెన్యూ ఆదాయం చాలా తక్కువ, విభజన తర్వాత ఏపీ రైతులకు, ప్రజలకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయన్నారు.
తాను కూడా రైతు బిడ్డనేనని, అందుకే రైతు కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తానని చెప్పారు. ఒక్కో రైతుకు లక్షన్నర రుణ విముక్తి చేయడం మామూలు విషయం కాదన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు కూడా రుణమాఫీ చేయడం లేదన్నారు.
నేనొక్కడినే కష్టపడితే అభివృద్ధి సాధ్యం కాదని, అందరు కలిసి రావాలన్నారు. రాబోయే రోజుల్లో కృష్ణా, సోమశిల నదులను అనుసంధానం చేస్తామన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని భూగర్భ జలాలను కాపాడుతామన్నారు. రెండో విడతలో రూ.3500 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలనే రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications