మెట్టు దిగిన చంద్రబాబు: మొన్న ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని అసంతృప్తి
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. తాను ఇటీవల వచ్చినప్పుడు నిర్మాణం ఎలా ఉందో, ఇప్పుడు అలాగే కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో సచివాలయ నిర్మాణ పనులను వేగిరం చేయాలని, ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ ఈ పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు గాను విజయవాడ రియల్ ఎస్టేట్ సంఘం నుంచి పెద్దఎత్తున భవన నిర్మాణ కార్మికులను ఉపయోగించుకోవాల్సిందిగా ఎల్అండ్ టీ అధికారులకు చంద్రబాబు సూచించారు.

జూన్ 27 నుంచి పరిపాలన అంతా అమరావతి నుంచే సాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా పది రోజులు గడువు మాత్రమే ఉంది. దీంతో మరో పది రోజుల్లో పూర్తిస్థాయిలో తాత్కాలిక సచివాలయ భవనాలు సిద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు 27 నాటికి వీలైనన్ని శాఖలు అమరావతికి వస్తాయని, వీలైనంత మందిని రప్పిస్తామన్నారు.
22వ తేదీ వరకు ఎన్ని శాఖలు తరలివస్తాయన్న విషయంపై స్పష్టత వస్తుందని, ఆ శాఖల్లో కూడా కొందరు హైదరాబాద్‌లో ఉంటారని ఆయన అన్నారు. భవిష్యత్తులో మంత్రులూ, కార్యదర్శులూ ఒకే చోట ఉంటారని, అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ సుపరిపాలన అందించడమే తన లక్ష్యమన్నారు.
ప్రతి ఒక్కరిలో అభివృద్ధి తపన పెరగాలని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మరింత పారదర్శకతను తీసుకొస్తామని చెప్పారు. రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపునకు ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోవడంతో ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్లేందుకు అంగీకరించారు.
కుటుంబాలను వదిలి అమరావతికి వచ్చే ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, వారానికి అయిదు రోజుల పని దినాలను ఏపీ ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన ఉద్యోగ సంఘాలు అయిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తాము అమరావతికి వచ్చేందుకు సిద్ధమేనని ప్రకటించాయి.












Click it and Unblock the Notifications