ఏపీలో ఆ జిల్లాలకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో మహర్దశ!
బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరియు విజయవాడకు ప్రయాణించే వారికి శుభవార్త. ఏపీలో రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం నేషనల్ హైవే ల పైన, గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ హైవే ల నిర్మాణం పైన ఫోకస్ పెట్టింది. తాజాగా మరో కొత్త ఆరు వరుసల రహదారి ప్రాజెక్టు వేగంగా అందుబాటులోకి వస్తోంది. కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో కీలక భాగంగా ఆ హైవే
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే బెంగళూరు-విజయవాడ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 12-13గంటల నుంచి 6-7గంటలకు తగ్గుతుంది. భారతమాల పరియోజన మొదటి దశలో భాగంగా రూ.14 వేల కోట్లతో ఈ అత్యాధునిక రహదారిని నిర్మిస్తున్నారు. ఈ హైవే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో కీలక భాగం. మొత్తం 342.24 కిలోమీటర్ల పొడవైన ఈ ఆరు వరుసల రహదారి శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్ కడప, నెల్లూరు, మార్కాపురం (ప్రకాశం) జిల్లాల మీదుగా వెళ్తుంది.

ఆ మార్గంలో దాదాపు 60 శాతం పనులు పూర్తి
బెంగళూరు నుంచి కోడూరు వరకు ఉన్న రహదారిని ఉపయోగించి, అక్కడి నుంచి కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే మొదలవుతుంది. ముప్పవరం వద్ద మళ్లీ పాత హైవేతో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో దక్షిణ భారతదేశ రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు వస్తుంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలో హైవే పనులు బాగా సాగుతున్నాయి. చిలమత్తూరు, గోరంట్ల, పుట్టపర్తి, నల్లమాడ, ముదిగుబ్బ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం దాదాపు 60 శాతం పూర్తయింది.
ఈ ప్రాజెక్ట్‌లో ఇంజనీరింగ్ అద్భుతంగా ఏడు సొరంగాలు
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో పెన్నా నది, కుందూ నదులపై భారీ వంతెనలు నిర్మాణం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో అత్యధికం 140 కి.మీ. మేర హైవే విస్తరించి ఉంది. ఇక్కడ సింగరాయకొండ, మర్రిపూడి ప్రాంతాల్లో పనులు దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఇంజనీరింగ్ అద్భుతంగా ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. వీటిలో నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో 3.67 కి.మీ. పొడవైన సొరంగం అతి పెద్దది.
వచ్చే ఏడాది జూన్-జులై నాటికి హైవేను ప్రారంభించాలని లక్ష్యం
భూసేకరణ సమస్యలు ఉన్నప్పటికీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) వచ్చే ఏడాది జూన్-జులై నాటికి హైవేను ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ హైవే పూర్తి కావడంతో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. బెంగళూరు-విజయవాడ మధ్య సమయం తగ్గడం వల్ల వ్యాపారులు, ప్రయాణికులు ఎంతో లాభపడతారు. ఆంధ్రప్రదేశ్ రవాణా మౌలిక సదుపాయాలు మరింత బలపడతాయి.












Click it and Unblock the Notifications