మోదీ.. ఇక చంద్రబాబు చేతిలో: ఏకంగా కేంద్రంలో ఆ పదవిపై కన్ను?
Chandrababu Naidu: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. పట్టుమని 11 స్థానాలే.
అటు టీడీపీ- జనసేన- బీజేపీ 164 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ- 135, జనసేన- 21, బీజేపీ- 8 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేశాయి. తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి జనసేన, బీజేపీ.. సరికొత్త చరిత్రను సృష్టించాయి.

ఈ నేపథ్యంలో- అనూహ్య పరిణామాలు ఏర్పాడుతున్నాయి. టీడీపీ సాధించిన ఈ తిరుగులేని విజయం జాతీయస్థాయిలో అందరినీ ఆకర్షించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా టీడీపీ మద్దతు సైతం అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అటు బీజేపీ- ఎన్డీఏ కూటమి, ఇటు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా.. చంద్రబాబు మద్దతును సాధించడానికి తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టాయి కూడా.
ఈ క్రమంలో తమకు మద్దతు ఇస్తే- చంద్రబాబుకు కీలకమైన పదవులను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఆ రెండు కూటములు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎన్డీఏకి చంద్రబాబు మద్దతు ఇస్తారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్డీఏ జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబును నియమిస్తారనే ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది.
ఈ పరిస్థితుల మధ్య ఈ మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అంతకంటే ముందు- విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్లకు కృతజ్ఞత తెలియజేశారు. గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీని తమ కూటమికి అందించారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారాయన. కూటమికి 45, వైఎస్సార్‌సీపీకి 39 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయని గుర్తు చేశారు. తమపై ఏపీ ప్రజల విశ్వాసానికి ఇది అద్దం పట్టిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తమ కార్యకర్తలు నిద్రలేని రాత్రులు ఎదుర్కొన్నారని, పత్రికా స్వేచ్ఛను అడ్డుకున్నారని, మీడియా సంస్థలపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ఎన్డీఏ పొత్తు ఉన్నందున ఆ కూటమిలోనే కొనసాగుతానని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్రం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలపర్చడంపై దృష్టి సారిస్తామని, అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
కాగా- ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన అనంతరం లోక్‌సభ స్పీకర్ పదవిని చంద్రబాబు డిమాండ్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేశారు చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తాయి. స్పీకర్ పదవిని దక్కించుకోవడం వల్ల లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యులను తమ కంట్రోల్‌లో ఉంచుకునే అవకాశం లభిస్తుందని చంద్రబాబు భావిస్తోన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications