మాది సాఫ్ట్‌వేర్, మీది హార్డ్‌వేర్ అంటూ బాబు
బీజింగ్: చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం మూడో రోజు పర్యటన సాగుతోంది. మంగళవారం ఉదయం నుంచే చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతో బాబు సమావేశమయ్యారు. ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధికి ఆ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ భావిస్తోంది. ఆతరువాత జిగుహుబా కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గిజిహూ కంపెనీతో ఓ ఎంవోయూను ప్రభుత్వం కుదుర్చుకుంది.
తాము సాఫ్ట్‌వేర్ రంగంలో బలంగా ఉన్నామని, మీరు హార్డ్‌వేర్ రంగంలో దృఢంగా ఉన్నారని. ఇద్దరమూ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని చైనా పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. తమకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉందని, గణిత శాస్త్రంలోనూ భారతీయులు ముందున్నారని, సాఫ్ట్‌వేర్ రంగంలో భారతీయులు ప్రపంచం నలుమూలలా పని చేస్తున్నారని ఆయన చెప్పారు.
చైనా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు జియోమీ, ఫ్యాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జియోమీ అధ్యక్షుడు లిన్‌బెన్, ఉపాధ్యక్షులు హ్యుగో బర్రా, గ్యాజున్, ఫ్యాక్స్‌కాన్ ప్రతినిధి మైక్ చాంగ్ తదితరులు పాల్గొన్నారు. భారత్‌లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఏపీలో హార్డ్‌వేర్ రంగం అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరారు. ప్రధాని మోడీ నేతృత్వంలో నైపుణ్యాలు, ప్రమాణాల్లో తాము అత్యంత వేగవంతంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువత, వారి శక్తిసామర్థ్యాలే తమ బలాబలాలని తెలిపారు.
ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని చెప్పారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా తాను చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని, హైదరాబాద్‌కు దేశంలోనే నంబర్‌వన్ గుర్తింపు వచ్చిందని చంద్రబాబు చెప్పారు. నవ్యాంధ్రలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.
ఎపిలో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు స్థాపించాలని, ఇందుకు 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చూసే బాధ్యత తనదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో చైనా భాగస్వామి కావాలన్నది తన అభిమతమన్నారు. చైనా నుంచి 200-300 బిలియన్ డాలర్ల హార్డ్‌వేర్ దిగుమతులను భారత్ దిగుమతి చేసుకుంటోందని, తాము వీటికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఈ తొమ్మిది నెలల పాలనలో ఏపీలో ప్రవేశపెట్టిన నూతన విధానాలను వివరించారు. యాంత్రిక విధానాలతో ముందుకు వెళ్లకుండా నూతనత్వాన్ని ఆవిష్కరించాలన్నదే తమ సంకల్పమన్నారు.

కాగా, భారత్‌లో జియోమీ ప్రతినిధి మను జైన్ సమావేశంలో తమ సంస్థకు సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు జియోమీ ఉపాధ్యక్షురాలు గ్యాజున్ మాట్లాడారు. నవ్యాంధ్ర అభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు తపన తననెంతో ఆకట్టుకుందని ఆమె ప్రశంసించారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానం తీసుకురావడమే కాకుండా భారత్‌లో ఇతోధికంగా ఉద్యోగావకాశాలను కల్పిస్తామని చెప్పారు. అనేక సవాళ్లను ఎదుర్కొని, సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు వెళుతున్న చంద్రబాబు దార్శనికత తమను ఆకట్టుకుందని అన్నారు.
భవిష్యత్‌లో భారత్, ఏపీ, చైనా సంబంధాలు మరింత బలపడతాయనే ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. రాబోయే మూడు నాలుగేళ్లలో సెల్‌ఫోన్లు, సాఫ్ట్‌వేర్, టీవీ ఇతర ఎలకా్ట్రనిక్స్ తయారీలో పెట్టుబడులు పెట్టనున్నామని ఫాక్స్‌కాన్ ఉపాధ్యక్షుడు జోష్ ఫ్లాగర్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలెడ్జ్ ఎకానమీ ఏర్పాటే తన కలగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పనులను ఎంత వేగంగా చేయాలో.. యువతకు ఎలా ఉద్యోగాలు కల్పించాలనే అంశంపైనే ప్రతిరోజూ తాను ఆలోచిస్తానని చెప్పారు.
బౌద్ధం సాంస్కృతిక వారథిగా చైనా, భారతదేశాలను కలుపుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చైనా, భారత్ కలిసి పని చేయాలన్నదే తన అభిమతమని చెప్పారు. చైనా పర్యటనలో ఉన్న బాబు బృందం హెచ్‌ఎస్‌బీసీ ఇచ్చిన విందు సమావేశంలో పాల్గొంది.
పెట్టుబడులకు సిద్ధం: బీజింగ్ మేయర్
పరిశ్రమలు, పర్యాటకం, ఆర్థికాంశాలు సహా ఇతర ముఖ్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ మేయర్ వాంగ్ అన్ శున్ చెప్పారు. చంద్రబాబు బృందంతో సోమవారం ఆయన భేటీ అయ్యారు. ఇటీవల భారతదేశ ప్రధాని చొరవ కారణంగా ఇరు దేశాల సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమైందన్నారు. పెట్టుబడుల కోసం భారతదేశంవైపు చూస్తున్నామని చెప్పారు.
చైనాలో పెట్టుబడి అవకాశాల అభివృద్ధికి భారతీయులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఐటీ రంగంలో పరస్పర సహకారాన్ని కోరారు. బీజింగ్‌కు రావాలని భారతీయ వాణిజ్యవేత్తలను ఆహ్వానించారు. భారత్‌కు వెళ్లాలని చైనా కంపెనీలకు సూచించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన చైనా, ఏపీ సంబంధాల మెరుగుకు ఉపయోగపడుతుందన్నారు. పరస్పర సహకారం అందించుకోవడంలో ఏ శక్తీ మనలను ఆపలేదని శున్ పేర్కొన్నారు. ఏపీకి రావాలని, తమ ఆతిథ్యం స్వీకరించాలని బీజింగ్ మేయర్‌ను బాబు ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications