చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం - బోటు బోల్తా : వరద నీటిలో టీడీపీ నేతలు..!!
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. గోదావరి వరద ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు చంద్రబాబు ఈ రోజు రేపు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన ఉదయం నుంచి గ్రామాల్లో వరద నీటిలో బోటు పైన ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబును గోదావరి జిల్లాలకు చెందిన నేతలు అనుసరిస్తున్నారు. అందులో భాగంగా.. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా అపశృతి చోటు చేసుకుంది.

చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
చంద్రబాబు ప్రయాణం చేస్తున్న బోటు తప్పుకోగా.. నేతలంతా ప్రయాణిస్తున్న రెండు బోట్లు ఢీ కొని బోల్తా పడ్డాయి. చంద్రబాబు సురక్షితంగా బయట పడ్డారు. బోటులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా.. నిమ్మకాయల చినరాజప్ప.. ఉండి ఎమ్మెల్యే రామరాజు..తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, సత్యనారాయణ గోదావరి వరద నీటిలో పడిపోయారు. వారితో ఉన్న సహాయక సిబ్బంది వెంటనే వారిని వరద నీటిలో నుంచి తీసుకొని గట్టు పైకి చేర్చారు. మొత్తం 15 మంది వరకు వరద నీటిలో జారిపోయారు.

నీటిలో పడిపోయిన టీడీపీ నేతలు
చంద్రబాబు ముందుగా ఒక బోటులో వెళ్లిపోయారు. ఆయన్ను పూర్తిగా ఎన్డీఆర్ సిబ్బందితో పాటుగా రక్షణ సిబ్బంది ఉండటంతో ఆయన గట్టు మీద దిగే సమయంలో అన్ని అవకాశాలు తీసుకున్నారు. కొబ్బరి చెట్లకు మధ్య వరకు నిన్నటి దాకా ఆ ప్రాంతంలో వరద ప్రవాహం కొనసాగింది. రెయిలింగ్ వద్ద జరిగిన ఈ ఘటనలో చంద్రబాబు క్షేమంగా దిగి వచ్చారు. కానీ బరువుకు మించి నేతలు ఒక బోటులో ఉండటంతో..ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం.
టీడీపీ నేతలు అంతా సురక్షితంగా
ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెండు రోజుల పర్యటనలో భాగంగా..చంద్రబాబుకు లైఫ్ జాకెట్ వేయటంతో ఎటువంటి సమస్య తలెత్తలేదు. మిగిలిన నేతలకు లైఫ్ జాకెట్ లేదు. ఇక, ఉదయం నుంచి గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు బాధితులను పరామర్శించారు. ఇలపర్రు వద్ద చంద్రబాబు కాన్వాయ్ ఆపిన స్థానికులు.. తమ గోడును వెల్లబోసుకున్నారు.
శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని.. అందుకే ఇంకా తిరుగుబాటు చేయలేదన్నారు. దేశంలో అధిక ధరలకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చారని ఆరోపించారు. బాదుడే బాదుడు అంటూ సామాన్యుల నడ్డివిరిచారని మండిపడ్డారు.చంద్రబాబు పర్యటనలో భాగంగా..అధికారులు పాలకొల్లులోని రామచంద్ర గార్డెన్స్‌లో బస చేయనున్నారు.












Click it and Unblock the Notifications