
మోడీ ముందు చంద్రబాబు పాత డిమాండ్-అదీ అల్లూరిపైనే-భీమవరంలో హామీ లభిస్తుందా ?
భీమవరం : ఏపీలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ ఈ నెల 4న విగ్రహం ఆవిష్కరించనున్నారు. మోడీ భీమవరం టూర్ కు రావాలని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. అలాగే సినీ రంగం నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి సహా పలువురికి ఆహ్వానాలు అందాయి.అయితే ఈ కార్యక్రమానికి తాను రాకుండా అచ్చెన్నాయుడిని పంపుతున్న చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం ముందు ఓ పాత డిమాండ్ మళ్లీ పెట్టారు.

భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ
భీమవరంలో ఈనెల 4న ప్రధాని మోడీ చేతుల మీదుగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో మోడీ భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అల్లూరిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం కోరుకుంటోంది. అందుకే అన్ని రంగాల వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వనిస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడిని పంపుతున్న చంద్రబాబు ఇవాళ ఆయనకు ఓ లేఖ రాశారు.

పార్లమెంటులో అల్లూరి విగ్రహానికి డిమాండ్
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా భీమవరంలో పెడుతున్నట్లుగానే పార్లమెంటులోనూ ఆయన విగ్రహం పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ప్రధాని మోడీతో పాుట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా విడివిడిగా లేఖలు రాశారు. దేశమంతా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ఇందులో అల్లూరిని చేర్చడం తెలుగు జాతికి గర్వకారణమని చంద్రబాబు తెలిపారు.

గతం గుర్తుచేసిన చంద్రబాబు
గతంలో పార్లమెంటులో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటుకు వాజ్ పేయి సర్కార్ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు ప్రధాని, లోక్ సభ స్పీకర్ కు రాసిన లేఖల్లో గుర్తుచేశారు. అయితే అప్పట్లో కేంద్రం, ఉమ్మడి ఏపీలో ప్రభుత్వాలు మారడంతో అల్లూరి విగ్రహ ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లూరిని సత్కరించుకోవడమంటే దేశ స్ఫూర్తి, గిరిజన జాతులను గౌరవించుకోవడమే అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.